ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఆందోళనకరస్థాయికి చేరాయి. ఫ్యాన్లు, కూలర్లు గిర్రున తిరుగుతున్నా తట్టుకోలేని వేడి మనిషిని ఆగం చేస్తోంది. జిల్లా ఆసుపత్రిలోని బర్నింగ్ విభాగంలో కాలిన గాయాలతో అడ్మిట్ అయినవారికి చికిత్స అందిస్తుండగా సదరు విభాగంలో ఏసీ తప్పనిసరి. ఉన్న ఒక్క ఏసీ అలంకారప్రాయంగా మారగా బాధితులు అటు ఎండవేడి ఇటు కాలిన గాయాలతో ఏర్పడే మంటకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏసీ స్థానంలో కూలర్ ఏర్పాటు చేయగా గాలి ఒత్తిడికి కాలిన గాయాలు మరింత మండుతున్నాయని రోగుల బంధువులు చెబుతున్నారు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే.. ప్రభుత్వ ఆస్పత్రిలోని రెండో అంతస్తులో ఉన్న డ్రగ్స్, ఆల్కహాల్, మాదకద్రవ్యాల వల్ల తీవ్రమైన మత్తుకు గురైన వారికి అత్యవసర వైద్య సాయం అందించే ప్రత్యేక విభాగం ఒక్క పేషెంటు లేక ఖాళీగా ఉంది. అయినప్పటికీ
ఆ వార్డులో అన్ని లైట్లు వేసి ఉండగా వార్డు దగదగలాడుతోంది. ఫలితంగా సర్కారుకు విద్యుత్ ఖర్చు వృథా అవుతోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


