జగిత్యాలక్రైం/మేడిపల్లి: ఒకే ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో కన్నపేగులు తల్లడిల్లాయి. దేవునికి మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన రెండు కుటుంబాల్లోని చిన్నారులు కోనేరులో మునిగి చనిపోవడం విషాదం నింపింది. మృతదేహాలను జగిత్యాల ఆస్పత్రికి తీసుకురాగా.. అక్కడికి బంధువులు వందలాదిగా తరలివచ్చారు. అయ్యో బిడ్డలారా.. అప్పుడే మీకు నూరేళ్లు నిండాయా.. అంటూ రోదించడంతో ఆస్పత్రి ఆవరణ కన్నీటి సంద్రమైంది. మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్లకొండ శేఖర్, భార్గవి దంపతులు. శేఖర్ డిష్ కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వారికి షార్వింద్ (6) కుమారుడు. భార్గవి మళ్లీ గర్భం దాల్చడంతో శివారులోని శివగంగ వద్ద మొక్కులు చెల్లించేందుకు వెళ్లారు. కార్యక్రమానికి రావాలని జగిత్యాలలోని చిలుకవాడకు చెందిన భార్గవి అక్క భారతి, బావ భూషణంను కూడా ఆహ్వానించారు. దీంతో వారు కుమారుడు మన్విత్, కూతురు మనస్వినితో కలిసి శివగంగ వద్దకు చేరుకున్నారు. పెద్దలందరూ మొక్కులు చెల్లించి వంట చేసే ప్రయత్నంలో ఉండగా.. ముగ్గురు చిన్నారులు కోనేరు వద్ద ఆడుకుంటూ నీటిలో మునిగిపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో కోనేరు వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వారిని బయటకు తీసి జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ముగ్గురు చిన్నారులు మృతిచెందారన్న విషయం తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. పిల్లల మృతదేహాల వద్ద రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.
బిడ్డలారా.. అప్పుడే నూరేళ్లు నిండాయా..
బంధువుల రోదనలతో దద్దరిల్లిన ఆస్పత్రి
అప్పటి దాకా కళ్లముందే ఆటలు
కోనేరులో మునిగి ముగ్గురి మృతి
రెండు కుటుంబాల్లో తీరని విషాదం


