పాముకాటుతో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళ మృతి

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

కాల్వశ్రీరాంపూర్‌: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మడంలం వెన్నంపల్లికి చెందిన పూసాల వజ్రమ్మ(69) సోమవారం పాముకాటుకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వజ్రమ్మ తన ఇంట్లో పనులు చేస్తుండగా పాముకాటు వేసింది. పాము కరిచినచోట పసుపు రాసుకుంది. ఈవిషయాన్ని పక్కింటి వారికి చెప్పగా పెద్దపల్లిలో వడ్రంగి పనిచేస్తున్న ఆమె కుమారుడు రమణాచారికి సమాచారం అందించారు. చికిత్స కోసం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్‌ తెలిపారు.

వడ దెబ్బతో రైతు..

సిరిసిల్లఅర్బన్‌: సిరిసిల్ల పట్టణ పరిధిలోని 8వ వార్డు పెద్దూరుకు చెందిన రైతు రాచర్ల రవి (49) వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు.. రవి తనకున్న రెండెకరాల్లో వరి సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పి ఒక్కసారిగా ఇంట్లో పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య రాజేశ్వరి, కుమారుడు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కౌన్సిలర్లు, గ్రామస్తులు కోరారు.

చేపలు పట్టేందుకు వెళ్లి విద్యుత్‌ షాక్‌తో..

కోరుట్లరూరల్‌: కరెంట్‌ పెట్టి.. చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన మండలంలోని కల్లూర్‌ శివారు చెరువు మత్తడి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మాదాపూర్‌ గ్రామానికి చెందిన గాండ్ల మోహన్‌ (48) మంగళవారం సాయంత్రం విద్యుత్‌ తీగను చెరువులో వేసి చేపలు పడుతున్నాడు. విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మోహన్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

షార్ట్‌సర్క్యూట్‌తో లారీ దగ్ధం

జగిత్యాలరూరల్‌: జగిత్యాల అర్బన్‌ మండలం ధరూర్‌ బైపాస్‌రోడ్‌ నర్సింగాపూర్‌ వద్ద షార్ట్‌సర్క్యూట్‌తో లారీ దగ్ధమైంది. టీఆర్‌నగర్‌ గ్రామానికి చెందిన సంపంగి రవీందర్‌కు చెందిన లారీ జగిత్యాల నుంచి టీఆర్‌నగర్‌కు వెళ్తుండగా.. నర్సింగాపూర్‌ శివారులో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు చేరుకుని మంటలు ఆర్పేశారు. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణకాంత్‌ తెలిపారు.

మొగ్ధుంపూర్‌లో అగ్నిప్రమాదం

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం మొగ్ధుంపూర్‌లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో ధాన్యం ట్రాక్టర్‌కు తృటిలో ముప్పు తప్పింది. పోచమ్మగుడి ప్రాంతంలోని వరికొయ్యలకు మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి నిప్పంటించా డు. మంటలు పుట్నాల మిల్లు, రైసుమిల్లు ప్రాంతాలకు విస్తరించాయి. పుట్నాల మిల్లు ఆవరణలోని కొబ్బరి, మామిడిచెట్లు కాలిపోగా మంటలు సమీపంలోని రైసుమిల్లు వద్ద నిలిపిన ధాన్యం ట్రాక్టర్ల వద్దకు వ్యాపించాయి. అప్రమత్తమైన రైసుమిల్లు యజమాని వెంకటేశ్వర్లు హమాలీలతో నీళ్లు పోయించి, మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్‌లో ఫైరింజన్‌ అందుబాటులో లేకపోవడంతో చొప్పదండి నుంచి వచ్చిన ఫైరింజన్‌తో పొలాల్లో వ్యాపించిన మంటలను ఆర్పివేశారు. రైతులకు చెందిన విద్యుత్‌మోటార్లు, వైర్లు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement