అద్దెకారులో తిరుగుతూ చోరీలు | - | Sakshi
Sakshi News home page

అద్దెకారులో తిరుగుతూ చోరీలు

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

పెద్దపల్లిరూరల్‌: కారుడ్రైవర్‌గా పనిచేస్తే వచ్చే వేతనం ఎటూ సరిపోవడం లేదు. తక్కువ సమయంలోనే ఆర్థికంగా ఎదగాలన్న దురాశతో ఓ కారును అద్దెకు తీసుకుని తాళం వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడ్డ ఊరడి జనార్దన్‌ను పెద్దపల్లిరూరల్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. సీఐ ప్రవీణ్‌కుమార్‌, పెద్దపల్లి రూరల్‌ ఎస్సై మల్లేశ్‌తో కలిసి విలేకరులకు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా పెద్దఅడిశర్ల మండలం రంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఊరడి జనార్దన్‌ కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే జీతం సరిపోవడం లేదని, తక్కువ సమయంలో ఎక్కువమొత్తంలో సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకు తన స్నేహితుడు ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా ముప్పాల మండలం మాదారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్‌తో జతకట్టాడు. ఇందరూ కలిసి అపహరించిన సొత్తును పంచుకున్నారు. వీరితో వెంకటేశ్‌ సోదరుడు తమ్మిశెట్టి మణికంఠ కూడా చేతులు కలపడంతో ముగ్గురు కలిసి పొద్దంతా కారులో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. 2025 సెప్టెంబర్‌లో నల్గొండలో ఓ కారు అద్దెకు తీసుకుని వరంగల్‌, కరీంనగర్‌ మీదుగా పెద్దపల్లికి చేరుకున్నారు. సుల్తానాబాద్‌ శివారులో ఓ ఇంటి ముందు ఉంచిన స్కూటీని అపహరించి పెద్దపల్లి మండలం నిమ్మనపల్లికి చేరుకున్నారు. సెప్టెంబర్‌ 15న రాత్రి ఇంటికి వేసిన తాళాలను పగులగొట్టి బీరువాలోని బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అనంతరం గుంటూరు మీదుగా గోవాకు పారిపోయారు. అక్కడ కొంత బంగారాన్ని గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మి వచ్చిన డబ్బుతో జల్సా చేశారు. రెండు తులాల బంగారు గొలుసును తమ వద్దనే ఉంచుకున్నారు. మరోసారి పెద్దపల్లి ప్రాంతంలోనే దొంగతనం చేయాలనే ఆలోచనతో ఊరడి జనార్దన్‌ వచ్చి.. కూనారం రైల్వేగేటు సమీపంలో అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలకు పాల్పడ్డట్టు తేలింది. నిందితుడి నుంచి రెడ్‌కలర్‌ బలెనో కారు, 20గ్రాముల బంగారుగొలుసు స్వాధీనం చేసుకున్నారు. అంతర్‌జిల్లా దొంగను పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని రామగుండం సీపీ, పెద్దపల్లి డీసీపీ, ఏసీపీలు అభినందించారు.

తాళం వేసిన ఇళ్లు టార్గెట్‌

అనుమానంతో అదుపులోకి

దొంగతనాలు చేసినట్లు విచారణలో వెలుగులోకి

నిందితుడి వివరాలు వెల్లడించిన సీఐ ప్రవీణ్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement