ధర్మపురిలో విజయలక్ష్మి లాడ్జి సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ధర్మపురిలో విజయలక్ష్మి లాడ్జి సీజ్‌

May 19 2026 11:59 PM | Updated on May 19 2026 11:59 PM

ధర్మపురి: నిబంధనలు పాటించనందుకు ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జిని సీజ్‌ చేసినట్లు సీఐ రాంనర్సింహారెడ్డి తెలిపారు. కరీంనగర్‌ జిల్లాకేంద్రంలోని పీఎంజే జువెల్లరీ షాపులో ఇటీవల ఆరుగురు వ్యక్తులు చొరబడి బంగారం దోచుకెళ్లిన విషయం తెలిసిందే. నిందితులు ఈ లాడ్జిలోనే బస చేసి రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో స్థానిక ఎస్సై మహేశ్‌ విజయలక్ష్మి లాడ్జిలో తనిఖీలు చేపట్టారు. యజమాని గుండయ్యను విచారించారు. రికార్డులు, రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. సరైన అనుమతులు, నిబంధనలు లేకపోవడంతో ఎస్పీ ఆదేశాలతో.. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి సూచనలతో లాడ్జిని సీజ్‌ చేసినట్లు సీఐ తెలిపారు. ట్రేడ్‌లైసెన్స్‌ లేకుండా గెస్ట్‌హౌజ్‌లు నిర్వహించడం.. గదుల కోసం వచ్చిన వారి నుంచి ఆధార్‌కార్డులు, వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం వంటివి గుర్తించామన్నారు. నిబంధనలు పాటించని లాడ్జిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డికి సూచించామన్నారు. వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ మీటర్లను ఉపయోగిస్తుండడంతో చర్యలు తీసుకోవాలని ఏఈకి సూచించామన్నారు. మున్సిపల్‌ మేనేజర్‌ గంగాధర్‌, శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ గంగాధర్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement