కరీంనగర్ అర్బన్: ‘ప్రతీ సోమవారం కలెక్టరేట్‌కు వస్తున్నాం.. పోతున్నాం.. సమస్యలు మాత్రమే అలాగే ఉంటున్నయ్.. మండుటెండలో మాకిదేం బాధమ్మా’.. అంటూ వృద్ధులు, అర్జీదారులు వాపోయారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ చిత్రా మిశ్రాతో గోడు వెల్లబోసుకున్నారు. తమ పిల్లలు పట్టించుకోవడం లేదని నాలుగువారాలుగా ప్రజావాణికి వస్తున్నామని, అయినా సాంత్వన కరవైందని వృద్ధ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. ఒక్కొక్కరిది ఒక్కో గాథ కాగా కలెక్టర్‌కు వివరిస్తూ పరిష్కరించాలని వేడుకున్నారు. ప్రధానంగా భూ సమస్యలు, కుమారుల నిరాదరణ, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లకు సంబంధించిన అర్జీలు రాగా కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్, కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ అర్జీలను స్వీకరించారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ఈ సందర్బంగా పలువురు ‘సాక్షి’తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారి మాటల్లోనే..
జవాబుదారిగా ఉండాల్సిన సర్పంచ్ అసభ్యకరంగా మాట్లాడుతోంది. గ్రామంలో జరిగిన అక్రమాలపై పలువురు ఫిర్యాదు చేస్తే ఇటీవల జరిగిన సమావేశఽంలో తీవ్ర పరుష పదజాలంతో దూషించింది. దళిత సర్పంచినంటూ ఇబ్బందికరంగా మాట్లాడుతుండగా పరిపాలన ఇబ్బందిగా మారింది. ఎవరూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా చెప్పుతో కొడతానంటున్నారు. ఇదేం పద్ధతి.
– చింతల శ్రీధర్‌రెడ్డి, ఉపసర్పంచ్,
లింగాపూర్, శంకరపట్నం
మరిది కొడుకు వెంకటేశ్‌కు ఇంట్లో ఆశ్రయమిచ్చాను. నా భర్త చనిపోయాక అతని పేరున ఉన్న డబ్బులు తీసుకునేందుకు నామిని సంతకం కావాలని చెప్పి నాతో బాండ్ పేపర్‌పై వేలిముద్రలు తీసుకున్నాడు. తీరా అది వేరేవారితో చదివిస్తే దత్తత అని రాయించుకున్నట్లు తెలిసింది. ఉన్న ఆస్తిని తన పేరున రాయాలని ఒత్తిడి చేస్తూ, మానసిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నాతో పాటు నా భూమి కొనుగోలు చేసిన ముస్కు లక్ష్మి, వేల్పుల శ్రీనివాస్ కుటుంబాలకు కూడా ప్రాణహాని ఉంది. పోలీసు రక్షణ కల్పించి అతడిని వెంటనే నా ఇంటి నుంచి ఖాళీ చేయించండి.
– వేల్పుల రాధమ్మ,
ఉప్పరమల్యాల, గంగాధర
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు మావి. రోజువారీగా లేబర్ అడ్డాకు వెళ్లి పనులు వెతుక్కుంటాం. ఉండటానికి ఇల్లు లేదు. కిరాయి ఇళ్లలో ఉంటున్నాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేస్తే మాకు ఇదివరకే బంగ్లా, కార్లు ఉన్నాయని ఆన్‌లైన్‌లో చూపిస్తుందట. ఇదెక్కడి అన్యాయం. అన్ని ఉన్నాయని నమోదు చేసిన అధికారులెవరూ.? అవెక్కడున్నాయో అధికారులే చూపించాలి.
– రాజమణి, పద్మ, చల్లా పద్మ,
చింతకుంట, కొత్తపల్లి
ఎస్సారెస్పీ కాలువలో పోయిన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. సర్వే నంబర్ 543/ఎ లోని భూమిలో రైస్‌మిల్లు నిర్మించారు. ఉన్న కొద్దిపాటి భూమికి మరింత భూమిని కలిపి రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు. అంతా తెలిసి కూడా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు.? అక్రమ నిర్మాణాలు జరిగినా మిన్నకుండటమేంటీ.?
– రాజిరెడ్డి, ముగ్ధంపూర్,
కరీంనగర్‌రూరల్
జీవో 81ను అమలు చేయకుండా నాన్చడం తగదు. 61 ఏళ్లు నిండినవారి వారసులకు కారుణ్య నియామకాలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. గత ప్రభుత్వం 81,85 జీవోలను జారీ చేయగా తహసీల్దార్ కార్యాలయాల నుంచి వివరాలు సేకరించారు. కానీ నేటికి నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రభుత్వం తక్షణమే చొరవ చూపి న్యాయం చేయాలి. – తెలంగాణ గ్రామ రెవెన్యూ
సహాయకుల సంఘం జిల్లా జేఏసీ


