దశాబ్దకాలంలో 25 మందికి కేన్సర్
ప్రస్తుతం చికిత్స పొందుతున్న మరో 20 మంది
కాలుష్యమే కారణమంటున్న గ్రామస్తులు
ఇటీవలే కరీంనగర్‌లో విలీనమైన గ్రామ పంచాయతీ
ప్రభుత్వం దృష్టి సారించాలని వేడుకోలు
సదాశివపల్లికి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
అది దాదాపు రెండువేల జనాభా గల కరీంనగర్ శివారులోని చిన్న గ్రామం. తీగల వంతెనను ఆనుకుని చూసేందుకు అందంగా కనిపిస్తుంది ఈ గ్రామం. ఇటీవలే దీన్ని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. ప్రస్తుతం గ్రామంలో అంతుచిక్కని మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దశాబ్దకాలంలో సుమారు 25 మంది వరకు అనారోగ్య కారణాలతో సంభవించిన మరణాలపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. వారంతా అకాల మరణం చెందారని, ఇందుకు కేన్సరే కారణమన్నది మిగిలిన గ్రామస్తుల్లో కలవరపాటుకు కారణమవుతోంది. ఆకస్మిక మరణాలకు కేన్సర్ కారణమని తెలిసినప్పటి నుంచి గ్రామంలో విద్యావంతులు, కాస్త స్థితిమంతులు ముందు జాగ్రత్తగా స్క్రీనింగ్ పరీక్షలకు సిద్ధమవుతుండడం గమనార్హం.
అసలేం జరుగుతోంది?
సదాశివపల్లి కరీంనగర్ నగరాన్ని ఆనుకుని ఉన్న గ్రామం. ఈ ఊరు ఇటు మానకొండూరుకు చెరువుకు, అటు కరీంనగర్‌ను ఆనుకుని ప్రవహిస్తున్న మానేరువాగుకు మధ్యలో ఉంటుంది. ఈ అనుకూలత కారణంగా దశాబ్దాల క్రితం ఇక్కడ అనేక రైస్‌మిల్లులు స్థాపించారు. రైస్‌మిల్లుల కారణంగా ఇక్కడ గాలి, భూగర్భజలాలు కలుషితమై ప్రజలు ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పంట కోతలు పూర్తయి.. వరి మిల్లుల్లో ఆడించే సమయంలో వరి పొట్టు, బూడిద, ఇతర దుర్వాసనలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వేసవిలో పారా బాయిల్డ్ రైస్ మిల్లలు నుంచి వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నామని వాపోతున్నారు. ఇదే క్రమంలో కొన్నేళ్లుగా గ్రామంలో అనారోగ్యంతో చనిపోతున్న పలువురు వ్యక్తుల మరణాలపై తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. వీరంతా కేన్సర్లతో మరణిస్తున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అయితే, ఒకే గ్రామంలో 25 మంది వరకు కేన్సర్‌తో మరణించడం, మరో 20 మంది వరకు కేన్సర్ లక్షణాలతో చికిత్స పొందుతున్నారన్న వార్త కలవరపాటుకు గురిచేస్తుంది.
శాసీ్త్రయత ఎక్కడ?
చిన్న గ్రామంలో ఇంత మంది కేన్సర్‌బారిన పడ్డారన్న విషయం ఆందోళనకరం. కానీ, మరణించిన వారికి కేన్సర్ ఎందుకు వచ్చింది? మిగిలిన వారికి ఎలా సోకింది? అన్న విషయం వీరెవరికీ అంతు చిక్కడం లేదు. కేన్సర్ మహమ్మారి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. దానికి స్థానికంగా కాలుష్యం ఒక కారణం మాత్రమే. ఆ కాలుష్యమే బాధితులకు కేన్సర్ రావడానికి కారణంగా నిలిచిందా? అన్న ప్రశ్నకు వైద్యారోగ్య శాఖ అధికారులే సమాధానం చెప్పాలి. దీనికి శాసీ్త్రయంగా వైద్య పరీక్షలు జరిపితే గానీ, అసలు లోపం ఎక్కడుంది? ఏ కారణం వల్ల ప్రజలు జబ్బు పడుతున్నారన్న విషయంపై స్పష్టత రాదు. దీనిపై డీఎంహెచ్‌వో వెంకటరమణను వివరణ కోరగా.. త్వరలో వైద్యపరీక్షల ద్వారా స్క్రీనింగ్ చేసి వాస్తవాలు తెలుసుకుంటామని వెల్లడించారు.


