పలు శాఖల్లో పైరవీలకే ప్రాధాన్యత
ద్వితీయ శ్రేణి నేతల రంగ ప్రవేశం
అటు అధికారులు, ఇటు నేతల బేరసారాలు
సాధారణ బదిలీల్లో ఎన్నెన్నో పదనిసలు
కరీంనగర్ అర్బన్: ఉద్యోగుల సాధారణ బదిలీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు శాఖల్లో ఇష్టారీతిగా వసూళ్ల దందా సాగుతోందని, ఇందులో ద్వితీయ శ్రేణి నేతలు రంగప్రవేశం చేశారని సమాచారం. ఇటీవల సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో పలువురు అధికారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. జిల్లా, మల్టీజోన్ పరిధిలో బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరికివారు పైరవీలకు తెరలేపారు. కొందరు మంత్రుల సహకారం కోరుతున్నారు. మరికొందరు అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నారు. కాగా, ఎక్కడైనా పని చేస్తామనుకునేవారు వీరి నిర్వాకాన్ని చూసి నిర్ఘాంతపోతున్నారు. ఈ నెల 1నుంచి 7 వరకు ఉద్యోగులు/ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు, సీనియారిటీ జాబితా, ఖాళీల ప్రదర్శన, బదిలీ అయ్యే ఉద్యోగుల జాబితాను రూపొందించారు. ఈ నెల 15వరకు ఉద్యోగుల ఆప్షన్లతో కూడిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది.
కదపకుంటే కాసులే కాసులు
కలెక్టరేట్‌లో అక్కడక్కడే పనిచేసే ఉద్యోగులతోపాటు అధికారులూ ఉన్నారు. వారిలో సింహభా గం ఇక్కడి నుంచి వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. అదే క్రమంలో తమకున్న పలుకుబడిని విని యోగిస్తున్నారు. బదిలీల నిబంధనల్లో 40శాతం మించకుండా ఉండరాదన్న కారణాన్ని బూచిగా చూపి సీటు కదలకుండా పావులు కదుపుతున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ట్రెజరీ, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలో ఎక్కువగా పైరవీలు సాగుతున్నట్లు తెలుస్తోంది. బదిలీ తప్పనిసరి అయ్యే ఉద్యోగుల జాబితా నుంచి వెసులుబాటు కల్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అనుకూల పోస్టుకు పైరవీలు
విద్య, పోలీస్, వాణిజ్య పన్నులు, ఎకై ్సజ్, రవాణా, అటవీశాఖ ఉద్యోగులు మినహా మిగిలిన 40కి పైగా ప్రభుత్వ శాఖల్లో బదిలీల సందడి నెలకొంది. ఈ క్రమంలో అనుకూల ప్రాంతంలో పోస్టింగ్ కోసం పలుకుబడి, రాజకీయ నేపథ్యం, మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, రాజకీయ నేతలను కలుస్తూ ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కీలక స్థానాల్లోనే ఉండేలా కసరత్తు చేస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏఈలు, ఏవోలు, ఏపీవోలతోపాటు ఇరిగేషన్, తదితర శాఖల అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్లు ఒకేచోట పనిచేసి ఉంటే బదిలీకి అర్హులు. నాలుగేళ్లు ఒకేచోట పనిచేసిన ఉద్యోగికి బదిలీ తప్పనిసరి. 2027 మే 31కి ముందుగా రిటైర్డ్ అయ్యేవారికి బదిలీ ఉండదు. ఎక్కువమంది ఒకే చోట కోరితే స్పౌజ్ కేటగిరితో పాటు 70శాతం వైకల్యం ఉన్న ఉద్యోగులు, మానసిక వైకల్యంతో కూడిన పిల్లలున్న ఉద్యోగులు, వితంతువులు, మెడికల్ గ్రౌండ్స్ ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
కేడర్ వారీగా బదిలీల బాధ్యతలు
బదిలీలను రాష్ట్రస్థాయి, మల్టీజోన్, జోనల్, జిల్లా కేడర్‌గా విభజించారు. ఆయా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో పోస్టులకు శాఖకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. హెచ్‌వోడీ కన్వీనర్‌గా, అదనపు, సంయుక్త, ఉప కార్యదర్శులు సభ్యులుగా ఉండనున్నారు. అలాగే మల్టీజోనల్, జోనల్ స్థాయి పోస్టుల బదిలీలకు హెచ్‌వోడీ చైర్మన్‌గా, కార్యదర్శి సూచించినవారు సభ్యులుగా, హెచ్‌వోడీ సూచించినవారు కన్వీసర్‌గా వ్యవహరించనున్నారు. జిల్లా కేడర్ పోస్టులకు కలెక్టర్ చైర్మన్‌గా, అదనపు కలెక్టర్, డీఆర్వో సభ్యులుగా.. శాఖకు సంబంధించిన జిల్లా అధికారి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.


