పెట్రో ధరలు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

పెట్రో ధరలు తగ్గించాలి

May 19 2026 12:22 AM | Updated on May 19 2026 12:22 AM

కరీంనగర్‌కార్పొరేషన్‌: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని సోమవారం మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నగరంలోని డీసీసీ కార్యాలయం నుంచి పద్మనగర్‌ డెయిరీ పెట్రోల్‌ బంక్‌ వరకు ప్రదర్శనగా వచ్చి నిరసన తెలిపారు. సామాన్య ప్రజలపై కేంద్రం భారం మోపిందని జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి అన్నారు. గాజుల సుకన్య, వంగల కల్యాణి, రజితా రెడ్డి, కవ్వ పద్మ పాల్గొన్నారు.

పీఆర్సీ ప్రకటించాలి

కరీంనగర్‌టౌన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయులకు 50శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్‌ వెంకటరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం నగరంలోని సుభాష్‌నగర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగ, ఉపాధ్యాయులను తప్పుదోవ పట్టిస్తున్నదని, పీఆర్సీ కోసం మరో పోరాటం చేయక తప్పదని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఉమ్మడి జిల్లా నాయకులు భూక్య రాజేశ్‌నాయక్‌, క్రాంతికుమార్‌, ధర్మాజీ, చాందిని, గుండారపు పోతన్న, గంగన్న, సాయన్న తదితరులు పాల్గొన్నారు.

20న మెడికల్‌ షాపులు బంద్‌

కరీంనగర్‌: ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ–ఫార్మసీ విధానాలు, తదితర అంశాలపై నిరసనగా ఈనెల 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్‌ షాపులు బంద్‌ చేయనున్నట్లు కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రామ్మోహన్‌, ప్రధాన కార్యదర్శి మునీందర్‌ తెలిపారు. సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ఈ–ఫార్మసీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వల్ల చిన్న మెడికల్‌ షాపులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కరోనా సమయంలో తీసుకొచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మెడికల్‌ షాప్‌ల యజమానులు పాల్గొన్నారు.

కళాకారులకు సంక్షేమ పథకాలు అందించాలి

కరీంనగర్‌టౌన్‌: రాష్ట్రంలోని అన్నిరంగాల కళాకారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందించడంతో పాటు, పెన్షన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు వరుకోలు సదానందం కోరారు. సోమవారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర 4వ మహాసభల పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజానాట్య మండలి మహాసభలు ఈనెల 25,26వ తేదీల్లో హైదారాబాద్‌లో జరుగుతాయని, కళాకారులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, ఉపాధ్యక్షురాలు కోమల, సహాయ కార్యదర్శులు మంజుల, సదానందం, కోశాధికారి రాజమౌళి, జిల్లా కార్యవర్గ సభ్యులు రవి, సముద్రాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

రెడ్‌ క్రాస్‌ సభ్యత్వ నమోదు డ్రైవ్‌ ప్రారంభం

కరీంనగర్‌: రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ప్రత్యేక డ్రైవ్‌ను కలెక్టర్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధ్యక్షురాలు చిత్రా మిశ్రా సోమవారం ప్రారంభించారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు (క్రిమినల్‌ కేసులు లేనివారు) రెడ్‌ క్రాస్‌ సభ్యత్వం పొందవచ్చని తెలిపారు. సభ్యత్వం కోసం దరఖాస్తు ఫాం, రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, ఆధార్‌ కార్డు ప్రతిని సమర్పించి రూ.1,100 శాశ్వత సభ్యత్వ ఫీజు చెల్లించాలని సూచించారు. ఈనెల 15 నుంచి జూన్‌ 15 వరకు రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు (ఆదివారం మినహా) రెడ్‌ క్రాస్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని చైర్మన్‌ పి.కేశవరెడ్డి తెలిపారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement