బలహీనవర్గాల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

బలహీనవర్గాల సంక్షేమానికి కృషి

May 19 2026 12:22 AM | Updated on May 19 2026 12:22 AM

● మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌కార్పొరేషన్‌: బలహీనవర్గాల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సోమవారం నగరంలోని ఇందిరాభవన్‌లో రాష్ట్ర మున్నూరుకాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ బొమ్మ శ్రీరాం చక్రవర్తి అభినందన సభకు హాజరై మాట్లాడారు. కులం, మతం కన్నా విద్యతోనే పురోగతి ఉంటుందని, అందుకే ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కుల సంఘాలకు హైదరాబాద్‌లో కేటాయించిన స్థలాల్లో త్వరలోనే మహాత్మా జ్యోతి బాపూలే ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ, మున్నూరుకాపుల సంక్షేమానికి ఎంతగానో పాటుపడిన బొమ్మ వెంకటేశ్వర్‌ కుమారుడికి పదవి రావడం సంతోషకరమన్నారు. విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణనలో కులం కాలమ్‌ను చేర్చాలన్నారు. చైర్మన్‌గా నియమితులైన అనంతరం మొదటిసారి జిల్లాకు వచ్చిన శ్రీరాంకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

త్వరలోనే బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

క్రియాశీలకంగా వ్యవహరించండి

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్‌ శ్రేణులు క్రియాశీలకంగా వ్యవహరించాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జిల్లా పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు.

సగం ధాన్యం కొనుగోళ్లు పూర్తి

కరీంనగర్‌అర్బన్‌: జిల్లాలో 50 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సీజన్లో 3.61 టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అంచనా వేశామన్నారు. కలెక్టర్‌ చిత్రామిశ్రా మాట్లాడుతూ, 50శాతం కొనుగోళ్లు చేసి రాష్ట్రస్థాయిలో ముందున్నామన్నారు. పీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌, సీపీ గౌస్‌ ఆలం, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవోలు మహేశ్వర్‌, రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement