ఎండాకాలం.. బండి పైలం | - | Sakshi
Sakshi News home page

ఎండాకాలం.. బండి పైలం

May 19 2026 12:16 AM | Updated on May 19 2026 12:16 AM

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

జాగ్రత్తలు పాటించాలి

కూలింగ్‌ ప్యాడ్‌ ఉపయోగించాలి

Heat Wave

కరీంనగర్‌/జ్యోతినగర్‌: రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలకే కాకుండా వాహనాల భద్రతకూ సవాలుగా మారుతున్నాయి. మనిషి ఎండ నుంచి రక్షణ పొందేందుకు ఎంత జాగ్రత్త తీసుకుంటారో, వాహనాలు, ఎలక్ట్ట్రానిక్‌ పరికరాలను కాపాడుకునేందుకు అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది. వాహనాలను ఎండలో గంటల తరబడి పార్కింగ్‌ చేయడం వల్ల పెట్రోల్‌ ఆవిరైపోవడం, ఇంజిన్‌ వేడెక్కడం, టైర్లలో ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే వాహనాల్లో మంటలు చెలరేగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.

● వాహనాలను ఎక్కువసేపు ఎండలో పార్క్‌ చేయొద్దు. సాధ్యమైనంత వరకు చెట్ల నీడ లేదా షెడ్లలో నిలపాలి. వాహన రేడియేటర్‌లో నీటి స్థాయిని తరచూ పరిశీలించాలి. టైర్లలో గాలి ఒత్తిడి సరిగా ఉందో లేదో చెక్‌ చేయాలి. ఇంజిన్‌ ఆయిల్‌, కూలెంట్‌ స్థాయిలను నిరంతరం పరిశీలించాలి. ప్రయాణానికి ముందు బ్రేకులు, బ్యాటరీ పరిస్థితిని తనిఖీ చేయాలి. పెట్రోల్‌, డీజిల్‌ను కాకుండా రాత్రి, సాయంత్రం సమయాల్లో నింపడం మంచిది.

● గ్యాస్‌ కిట్లతో నడిచే వాహనాలను మరింత జాగ్రత్తగా ఉపయోగించాలి. అధిక వేడి సమయంలో దీర్ఘకాల ప్రయాణాలు తగ్గించడం మంచిది. వాహనాల్లో ఏసీ నిల్వ ఉండేందుకు అద్దాలకు క్లాత్‌ మ్యాట్స్‌ ఉపయోగించడం ప్రయోజనకరం.

● వేసవిలో మొబైల్‌ ఫోన్లు త్వరగా వేడెక్కే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల బ్యాటరీ పనితీరు తగ్గిపోవడం, పేలుడు ప్రమాదం కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫోన్లను ఎండలో ఉంచొద్దు. చార్జింగ్‌ సమయంలో ఫోన్‌ను ఉపయోగించకూడదు. లోకేషన్‌, బ్లూటూత్‌, హాట్‌స్పాట్‌ వంటి అవసరం లేని ఫీచర్లను ఆఫ్‌ చేయాలి. నకిలీ చార్జర్లు, లోకల్‌ బ్యాటరీలను ఉపయోగించొద్దు.

● ల్యాప్‌టాప్‌లు ఎక్కువ వేడితో స్లో కావడం, హ్యాంగ్‌ అవ్వడం, బ్యాటరీ దెబ్బతినడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ల్యాప్‌టాప్‌ను బెడ్‌, దుప్పట్లపై కాకుండా గాలి వెళ్లే స్థలంలో ఉపయోగించాలి. కూలింగ్‌ ప్యాడ్‌ ఉపయోగించడం మంచిది. ఎక్కువసేపు చార్జింగ్‌లో ఉంచకుండా జాగ్రత్తపడాలి.

● పవర్‌ బ్యాంకులు, బ్లూటూత్‌ ఇయర్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు వంటి పరికరాలను అధిక వేడి నుంచి దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎండలో పార్కింగ్‌తో అగ్ని ప్రమాదాల భయం

పెట్రోల్‌ ఆవిరి, ఇంజిన్‌ వేడి, టైర్ల పేలుళ్లకు అవకాశం

అధిక వేడితో ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లకు ముప్పు

జాగ్రత్తలు పాటించాలంటున్న నిపుణులు

వేసవిలో వాహనాలను నీడలో ఉంచాలి. ఇంజిన్‌ ఆయిల్‌ మార్పిడి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూరప్రయాణాలు చేయాల్సి వస్తే మార్గమధ్యలో బండికి కాస్త విరామం ఇవ్వాలి. ద్విచక్రవాహనంలో పెట్రోలు ట్యాంకు ఫుల్‌గా ఉంచరాదు.

– సత్యం,

బైక్‌ మెకానిక్‌, ఎఫ్‌సీఐ క్రాస్‌ రోడ్‌, ఎన్టీపీసీ

ల్యాప్‌ట్యాపులకు కూలింగ్‌ ప్యాడ్‌లను ఉపయోగించాలి. చల్లని ప్రదేశంలో వాడాలి. ఎక్కువ సమయం చార్జింగ్‌లో ఉండకుండా జాగ్రత్త పడాలి. డేటాను ప్యాకప్‌ చేసుకోవాలి.

– కూర మహేశ్వర్‌రెడ్డి, విజన్‌ టెక్నాలజి, ఎన్టీపీసీ

Advertisement
 
Advertisement
Advertisement