రేవంత్‌ పాలనలో మహిళలకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

రేవంత్‌ పాలనలో మహిళలకు పెద్దపీట

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

● కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం ● సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

● కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం ● సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మహిళా కాంగ్రెస్‌ సమీక్ష సమావేశం బుధవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే గొప్ప ఆలోచనను తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, అందులో భాగంగానే పెట్రోల్‌బంక్‌లు, ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు మహిళలే యజమానులని, వారి ఖాతాలో రూ.5లక్షలు వేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో యంగ్‌ ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ మహిళానాయకుల జాబితా తయారు చేసి తనకు ఇవ్వాలని, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఇన్‌చార్జీ మీనాక్షినటరాజన్‌ను కలిసి నామినేటెడ్‌ పదవులు ఇచ్చేలా చూస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ధర్మపురి నియోజకవర్గంలో ఏడు మండలాలలో ఒక్కో మండలంలో వెయ్యి మంది మహిళలతో ప్రత్యేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారని గుర్తు చేసుకున్నారు.

మహిళల వాటా సాధిస్తాం: మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ

వచ్చే ఎన్నికల నాటికి చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ను సాధిస్తామని, రాష్ట్రంలో 50 మంది మహిళా ఎమ్మెల్యేలు అవుతారని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ధీమా వ్యక్తంచేశారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌ బిల్లు పట్ల చిత్తశుద్ధి ఉంటే, డీలిమిటేషన్‌తో కలిపి బిల్లును బీజేపీ ఎందుకు తీసుకువచ్చిందన్నారు. ప్రతి మహిళ కార్యకర్త క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. పార్టీలో సంవత్సరాలుగా ఉంటూ కష్టపడుతున్న మహిళా నాయకులకు నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలంటూ పలువురు కోరారు. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి, ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మహాలక్ష్మి, సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కాముని వనిత, చర్ల పద్మ, వెన్నం రజిత రెడ్డి, పూదరి రేణుక గౌడ్‌,పడిశెట్టి వసంత లక్ష్మి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement