● అనాథలైన చిన్నారులు
● చికిత్స పొందుతూ మృతిచెందిన హమాలీ అశోక్
కోరుట్లటౌన్: కోరుట్ల పట్టణానికి చెందిన బొగడమీది అశోక్ (36) మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు.. హమాలీ పని చేసే అశోక్‌ది పేద కుటుంబం. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో భార్య చనిపోయింది. పదేళ్ల లోపు ఉన్న ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ హమాలీ పనులతో ఉపాధి పొందుతున్నాడు. ఈ నెల 2న సివిల్ సప్‌లై బియ్యం గోదాంలో లారీలో నుంచి బియ్యం అన్‌లోడ్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా బియ్యం బస్తాలు కిందపడడంతో బస్తాలతో సహా అశోక్ లారీ పైనుంచి కింద పడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. 10 రోజులుగా చికిత్స పొందుతున్న అశోక్ ఆదివారం మృతిచెందాడు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. అశోక్ అంత్యక్రియలకు హమాలీ సంఘం ప్రతినిధులు సాయిబాబా, పండితు ఇస్తారు, లాలయ్య, రమేశ్, మల్లేశ్, తిరుపతి, రాజు, సభ్యులు హాజరై సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుంటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అశోక్ పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని, రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు డిమాండ్ చేశారు.


