● బంగారం, వెండితోపాటు బైక్‌లు స్వాధీనం
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని వివిధ ఆలయాలు, ద్విచక్ర వాహనాలు, ఆరుబయట నిద్రిస్తున్న వారి వస్తువులు చోరీచేసిన ఘటనల్లో శానగొండ గ్రామానికి చెందిన పాత నేరస్తుడు గుంటి శ్రావణ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. పోలీసు సిబ్బందితో కలిసి ఎస్సై శానగొండ గ్రామంలో శనివారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటుగా బైక్‌పై వచ్చిన వ్యక్తి వాహన ధ్రువీకరణ పత్రాల గురించి ఆరా తీశారు. వివరాలు చెప్పకపోవడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తాను జీలకుంట, గుండ్లపల్లి, బాయమ్మపల్లె, పొత్కపల్లి ఆలయాల్లో చోరీలతోపాటు ద్విచక్రవాహనాలు అపహరించినట్లు ఒప్పుకున్నాడు. ఇతడు పాతనేరస్తుడని పోలీసులు వివరించారు. నిందితుడి నుంచి 5గ్రాముల బంగారం, 4తులాల వెండి రింగులు, 10 తులాల రా ముక్కలు, మూడు బైక్‌లు స్వాధీనం చేసుకొన్నారు. ఈమేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై వివరించారు.


