బతకాలి.. విజయాన్ని వెతకాలి..! | - | Sakshi
Sakshi News home page

బతకాలి.. విజయాన్ని వెతకాలి..!

Apr 12 2026 2:42 AM | Updated on Apr 12 2026 2:42 AM

ఫెయిల్‌ అయ్యామని మనోధైర్యం కోల్పోవద్దు ముందుంది ఉజ్వల భవిష్యత్‌ మార్కులు..ర్యాంకులే కాదు కొలమానం

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): ఫస్ట్‌ ర్యాంక్‌.. ఫస్ట్‌ ర్యాంక్‌.. ఫస్ట్‌ ర్యాంక్‌.. నేటి విద్యార్థులు ఇదేదో జీవితలక్ష్యం అనుకుంటున్నారు. ఇక్కడే వారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. చదువు అంటే ర్యాంకులు.. మార్కులు అనే కోణంలోనే చూస్తున్నారు. చదువు అంటే ఏం నేర్చుకున్నాం.. ఎంత నేర్చుకున్నాం.. మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుందనే ఆలోచన లేకుండా పోయింది. తక్కువ మార్కులు వచ్చిన తమ స్కూల్‌ సీనియర్‌ విద్యార్థులు జీవితాల్లో ఉన్నతంగా తమ కళ్లముందే ఎదుగుతున్నా వారిని స్ఫూర్తిగా తీసుకోవడం లేదు. మార్కులు వస్తేనే సక్సెస్‌... లేకుంటే జీవితమే లేదు అన్న ఆలోచనలో పడిపోయారు. అయితే ఇక్కడే ఒక్క క్షణం ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. నేడు ఇంటర్‌ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్కులే జీవితం కాదనే సత్యాన్ని నేటి విద్యార్థులు గుర్తించాలి. రిజల్ట్స్‌ అనేవి ఒక దశ మాత్రమేనని.. అంతిమ గమ్యం కాదని విద్యానిపుణులు చెబుతున్నారు. ఒక వేళ ఫెయిల్‌ అయితే మళ్లీ ప్రయత్నించే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం సక్సెస్‌ అయిన బిజినెస్‌మెన్లు.. విద్యావేత్తలు.. క్రీడాకారులు.. తమ జీవితాల్లో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన వారేనని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. మార్కులు తక్కువగా వచ్చాయనే.. ఫెయిల్‌ అయ్యామనో అఘాయిత్యాలకు పాల్పడవద్దని కోరుతున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా మనోధైర్యంగా ముందుకెళ్తే విజయతీరాలను అందుకుంటామనే ఆలోచనతో ఉండాలని సూచిస్తున్నారు.

నిలిచి గెలిచిన హీరోలు

ప్రస్తుతం మన కళ్లెదుట రాణిస్తున్న వారు, ఒకప్పుడు ప్రతిభ చాటిన ప్రముఖులు పడిలేచిన కెరటాలు. నేటి ఓటమి రేపటి గెలుపునకు పునాదిని వేసుకొని గెలిచారు. మార్కులు, ర్యాంకులు జీవితం కాదని గ్రహించారు. ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్లే భవిష్యతులో గొప్పవాళ్లు కావచ్చుననే లక్ష్యంతో ముందుకుసాగారు.

ఒక్కసారి ఆలోచించండి

ఎవరి కుటుంబం వారికి ఓ అందమైన లోకం. అమ్మానాన్నలతో కలిసి ఆనందంగా గడిపిన క్షణలను గుర్తు చేసుకోండి. ఫెయిల్‌ అయ్యామని కుంగిపోకుండా సప్లిమెంటరీలో మంచిగా ప్రయత్నిస్తే విజయం మనదేనని గుర్తుంచుకోవాలి. మార్కులు తక్కువగా వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటే.. ఆ తర్వాత ఇంకేమి మిగిలి ఉండదనే విషయాన్ని గుర్తుంచుకుంటే అందమైన జీవితం మన సొంతమవుతుందనే ఆలోచన తెచ్చుకోవాలి. విద్యార్థులు ఫలితాల గురించి తల్లిదండ్రులకు.. తోటి స్నేహితులతో పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు సైతం తమ కాలేజీలో చదువుకున్న విద్యార్థులతో ఒకసారి మాట్లాడి మనోధైర్యం కల్పించాలని పలువురు విద్యావేత్తలు కోరుతున్నారు. ఇదే సమయంలో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి పెంచొద్దని సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement