తల్లిని హతమార్చిన తనయుడు | - | Sakshi
Sakshi News home page

తల్లిని హతమార్చిన తనయుడు

Apr 12 2026 2:42 AM | Updated on Apr 12 2026 2:42 AM

మల్లాపూర్‌లో దారుణం

కుటుంబ కలహాలే కారణం

మల్లాపూర్‌ : కుటుంబ కలహాలతో కన్నతల్లినే కడతేర్చాడు కొడుకు. ఈ ఘటన మల్లాపూర్‌ మండలకేంద్రంలో శనివారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల ప్రకారం గ్రామానికి చెందిన కుడుదుల వెంకవ్వ (90)కు కుమారుడు నంబయ్య (73), కూతురు ఉన్నారు. భర్త చనిపోయినప్పటి నుంచి వెంకవ్వ కుమారుడితోనే ఉంటోంది. నంబయ్య భార్య లక్ష్మీతో తరచూ గొడవ పడుతుంటే వెంకవ్వ సర్దిచెప్పేది. శుక్రవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరగగా.. వెంకవ్వ అడ్డుకుంది. దీంతో నంబయ్య ఆమె ముఖంపై దాడికి తెగబడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. మెట్‌పల్లి సీఐ అనిల్‌కుమార్‌, ఎస్సై అనిల్‌ ఘటనస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆర్‌ఐ అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

డిప్యూటేషన్‌పై పంపండి

రాయికల్‌: మండలంలోని మైతాపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థి దుగ్గిళ్ల అక్షయ్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీనికి ప్రధానోపాధ్యాయుడి వేధింపులే కారణమని ఆయన బంధువులు ఆరోపిస్తూ ఆందోళన చేయడం సరికాదని, తాము పాఠశాలలో పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నామని, ఈ క్రమంలో తమను మరో పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించాలని ఏడుగురు ఉపాధ్యాయులు ఎంఈవో రాఘవులుకు వినతిపత్రం సమర్పించారు. విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పాఠశాలలో ఉత్తీర్ణత కోసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులపై ఆరోపణలు చేయడం సరికాదని, విద్యార్థుల భవిష్యత్‌ కోసమే ఉపాధ్యాయులు పాటుపడతారని, తల్లిదండ్రులు గమనించాలని కోరారు. ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌పై అపర్థం చేసుకోవద్దని, విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకే ఉపాధ్యాయులు పాటుపడతారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్‌ హెడ్‌మాస్టర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు గంగనర్సయ్య, ప్రధాన కార్యదర్శి మానుపాటి బన్న, హెచ్‌ఎంలు బోగ రమేశ్‌, ఉపాధ్యాయులు గుర్రం శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

మైతాపూర్‌లో డీఈవో విచారణ

టెన్త్‌ విద్యార్థి అక్షయ్‌ ప్రధానోపాధ్యాయుడి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణల మేరకు శనివారం డీఈవో రాము పాఠశాలను సందర్శించారు. విచారణ చేపట్టారు. అనంతరం అక్షయ్‌ తల్లిదండ్రులను పరామర్శించారు.

శరీరదానానికి రిటైర్డ్‌ హెచ్‌ఎం అంగీకారం

కరీంనగర్‌/కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మెహర్‌నగర్‌కు చెందిన రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు సాగి రాంచందర్‌రావు దేహదానం చేసేందుకు ముందుకొచ్చారు. శనివారం సదాశయ ఫౌండేషన్‌ జాతీయ కార్యదర్శి మెరుగు భీష్మాచారి ఆధ్వర్యంలో రాంచందర్‌రావు కరీంనగర్‌ మండలం నగునూరులోని ప్రతిమ మెడికల్‌ కళాశాలను సంప్రదించారు. సీఏవో రాంచందర్‌రావు సూచనల మేరకు శరీరదానానికి సంబంధించిన దరఖాస్తుఫాంలో వివరాలు నింపి ఎనాటమీ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపాల్‌కు అందించారు. హెచ్‌ఎంగా ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక సేవాకార్యక్రమాల్లో భాగస్వాములవుతూ ప్రస్తుతం మెడికల్‌ కళాశాలకు శరీరదానం చేసేందుకు రాంచందర్‌రావు ముందుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఫౌండేషన్‌ ప్రతినిధులు నేదునూరి కనుకయ్య, ఆడెపు రాజకనుకయ్య, శ్రీపతి ప్రభాకర్‌, మెరుగు దేవిక, ద్వారకామయి తదితరులు పాల్గొన్నారు. కాగా సమాజహితం కోసం శరీరదానానికి ముందుకొచ్చిన రాంచందర్‌రావుకు సదాశయ ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ముఖ్యసలహాదారు రమేశ్‌, ప్రచార కార్యదర్శి వాసు, చంద్రమౌళి తదితరులు అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement