జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధి లో గంజాయి విక్రయించేందుకు వస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన గౌస్‌ఖాన్ జగిత్యాలకు గంజాయి తీసుకొచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడిని పట్టుకోగా 270 గ్రాముల గంజాయి లభించింది. నిందితుడిని అరెస్ట్ చేసి శనివారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితునిపై గతంలో జగిత్యాల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు, కోరుట్ల పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదైనట్లు వివరించారు.
వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి
కరీంనగర్‌క్రైం: కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఓ వ్యక్తి నగరంలోని ఓ ఆసుపత్రికి రాగా.. వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందాడని మృతుడి భార్య కరీంనగర్ టూటౌన్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూర్‌కు చెందిన వేముల శ్రీనివాస్(55) కిడ్నీ సమస్యతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి శుక్రవారం వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీలో రాయి పెద్దగా ఉందని ఆపరేషన్ చేయాలని సూచించారు. వైద్యం చేసే క్రమంలో మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో తన భర్త మృతిచెందాడని, ఆసుపత్రి వైద్యులు, యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య తిరుమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


