కరీంనగర్‌రూరల్: ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన 10మంది ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లను బుధవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. మానకొండూరు మండలం వెల్దికి చెందిన తాళ్లపల్లి అజయ్, అనిల్, వల్లంపహాడ్‌కు చెందిన సంకూరి అనిల్‌కుమార్, శ్రావణ్, బొజ్జం కుమార్, సుల్తానా బాద్ మండలం గట్టెపల్లికి చెందిన మహ్మద్ ఇలియాస్, గొల్లపల్లికి చెందిన కొయ్యడ రాజశేఖర్, మహేశ్, మల్లేశ్, సిలివేరి శ్రీకాంత్‌పై కేసులు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు వివరించారు. 10మందిని తహసీల్దార్ ఎదుట రూ.లక్ష పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి
మల్యాల: మండలంలోని రాజారం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ అబ్దుల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు.
విద్యుత్ వైర్లు చోరీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ గ్రామ శివారులో విద్యుత్ మోటార్లకు బిగించిన తీగలను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం ఎత్తుకెళ్లారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాచర్లబొప్పాపూర్‌కు చెందిన రైతులు పద్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాపురెడ్డి, రాజయ్య, రాజిరెడ్డి, సంతోష్‌రెడ్డిలకు చెందిన వ్యవసాయమోటార్లకు సంబంధించిన విద్యుత్ తీగలను ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ.50వేల వరకు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. ఈమేరకు మండల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చొప్పదండి: మండలంలోని కోనేరుపల్లి గ్రామం క్రీడామిత్ర పంచాయతీ ప్రణాళికలో భాగంగా మా ర్చి నెలలో నిర్వహించిన ఆన్‌లైన్ పోటీలో జాతీయస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. గ్రామాల్లోని యువతను క్రీడలవైపు మళ్లించేందుకు, భారత గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి దేశంలోని లక్షన్నరకు పైగా ఉన్న గ్రామ సర్పంచులను ఒకే వేదిక పైకి తెచ్చేందుకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన సర్పంచ్ సంవాద్ యాప్‌ను కోనేరుపల్లి గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాల్ రాజు సద్వినియోగం చేశారు. యువతకు క్రీడలు నిర్వహించి ఆన్‌లైన్ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. దీంతో మొదటి స్థానంలో నిలిపినందుకు రూ. 35వేల నగదు బహుమతి సర్పంచ్ గెలుచుకున్నారు. స్పోర్ట్స్ ఫ్రెండ్లీ విలేజ్ పోటీలో తెలంగాణ నుంచి కోనేరుపల్లి సర్పంచ్ రాజు మొదటిస్థానం సాధించగా, రెండోస్థానంలో మహారాష్ట్ర నుండి వైశాలి సందీప్ రాథోడ్ అనే మహిళా సర్పంచ్, మూడోస్థానంలో పంజాబ్ నుంచి గంగదీప్‌సింగ్ గెలిచారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో జాతీయస్థాయిలో బహుమతి సాధించినట్లు సర్పంచ్ రాజు తెలిపారు.


