తంగళ్లపల్లి(సిరిసిల్ల): తెలంగాణలో సంచలనం సృష్టించిన నేరెళ్ల ఘటన బాధితులకు తమిళనాడులోని ఒక కోర్టు తీర్పు కొత్త ఆశలను చిగురింపజేసింది. పదేళ్ల క్రితం జరిగిన నేరెళ్ల ఘటనలో పోలీసుల థర్డ్ డిగ్రీ చిత్రహింసలకు గురైన బాధితుడు కోల హరీశ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ తన ఆవేదన, ఆశను పంచుకున్నారు. తమిళనాడులో తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది పోలీసులకు కోర్టు మరణశిక్ష విధించడాన్ని హరీశ్ స్వాగతించారు. ‘తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా చట్టం ముందు సమానమే అని ఈ తీర్పు నిరూపించింది. ఇది మాలాంటి బాధితులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది’ అని పేర్కొన్నారు. అప్పటి ఐపీఎస్ అధికారి విశ్వజిత్ కంపటి, ఎస్సై రవీందర్ తోపాటు సుమారు 25 మంది పోలీసులు తమను అక్రమంగా నిర్బంధించి, కరెంట్ షాక్ ఇవ్వడం, రోకలి బండలతో కొట్టడం వంటి అమానుష చర్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గాయాలు, మానసిక క్షోభ నుంచి తాము ఇప్పటికీ కోలుకోలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం స్పందించాలి
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హరీశ్ కోరారు. నేరెళ్ల బాధితులకు అండగా ఉంటామని, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తామని సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ వీడియోను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రజలను కోరారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోల హరీశ్ డిమాండ్
సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ వైరల్


