కరీంనగర్‌క్రైం: సైబర్ నేరగాళ్ల మ్యూల్ ఖాతాలపై ఉక్కుపాదం మోపాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0లో ఇటీవల నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో 4 బ్యాంకు శాఖల్లో మొత్తం 34 మ్యూల్ ఖాతాలను గుర్తించి 20 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 26 మంది నిందితులను అరెస్ట్ చేశామని, ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0లో ఇప్పటికే 34 ఖాతాలను గుర్తించినట్లు తెలిపారు. నిందితులు సేవింగ్స్, కరెంట్ ఖాతాలను సులభంగా తెరుస్తున్నారని, ఇకపై ఖాతా ప్రారంభించే సమయంలో బ్యాంకర్లు కఠినంగా స్క్రూటినీ చేయాలని ఆదేశించారు. ఎవరైనా అధికారులు లేదా సిబ్బంది నిందితులతో కుమ్మక్కై తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఏటీఎం కేంద్రాల్లో సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షించాలని, సైబర్ నేరగాళ్లు ప్రజల సొమ్మును దారి మళ్లించకుండా బ్యాంకర్లు సాంకేతిక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేర రహిత కరీంనగర్‌ను రూపొందించేందుకు పోలీసులు, బ్యాంకింగ్ వ్యవస్థ సంయుక్తంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అడిషనల్ డీసీపీ వెంటరమణ, ఏసీపీలు, సీఐలు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.


