కోల్‌సిటీ: గోదావరిఖని జీఎంకాలనీకి చెందిన ఇరుగురాళ్ల శ్రీనివాస్ (50) అనే ఎల్‌ఐసీ ఏజెంట్ మంగళవారం అకస్మాత్తుగా మృతి చెందాడు. ఇంట్లో అస్వస్థతకు గురైన శ్రీనివాస్‌ను జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స ప్రారంభించేలోగా మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుకి సన్‌స్ట్రోక్ లక్షణాలే అయి ఉంటాయని కుటుంబ సభ్యులు, ఏజెంట్లు తెలిపారు. అంత్యక్రియల కోసం వారి స్వగ్రామమైన ధూళికట్ట గ్రామానికి తరలించారు. కాగా, శ్రీనివాస్ పార్థివదేహానికి ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు జనగామ సదయ్య, ప్రధాన కార్యదర్శి కటకం సతీశ్, కోశాధికారి అంబాల బాబు, జోనల్ నాయకులు బుర్ర దామోదర్‌తోపాటు ఎంప్లాయ్ అసోసియేషన్ నాయకులు, ఏజెంట్లు నివాళి అర్పించారు.
మహిళ ఆత్మహత్య
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామానికి చెందిన యాదగిరి భాగ్యలక్ష్మి(45) కడుపునొప్పి బాధ భరించలేక మంగళవారం క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకులు వెంటనే పెద్దపల్లి ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. మృతురాలి భర్త కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు.
కాలువలో వ్యక్తి మృతి
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి–ఓదెల గ్రామాల మధ్య ఎస్సారెస్పీ డీ–86కాలువలో గోదావరిఖనికి చెందిన బండారి రామరాజు(58) పడి మృతిచెందాడు. మంగళవారం ఉదయం కాలువలో రామరాజు మృతదేహం కొట్టుకురాగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బంధువులకు సమాచారం ఇచ్చారు. గోదావరిఖనికి చెందిన రామరాజు ఎలిగేడు మండలం శివపల్లికి తన స్నేహితుడి వద్దకు వచ్చినట్లు సమాచారం. అయితే, ప్రమాదవశాత్తు జారిపడ్డడా, లేదా ఇతరత్రా కారణాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
విద్యార్థిపై కోతుల దాడి
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని పోతుగల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై కోతులు దాడులు చేశాయి. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న ఐదుగురిపై దాడి చేయడంతో వారు భయాందోళనకు గురయ్యారు. ఐదో తరగతి చదువుతున్న మాచర్ల లక్కిపై కోతులు దాడి చేశాయి. అదే సమయంలో అటుగా వచ్చిన ఒకరు కోతులను వెళ్లగొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న లక్కి తండ్రి మాచర్ల భూపతి వెంటనే చిన్నారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చిరుత దాడిలో దూడ మృతి
సిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని 10వ వార్డు చిన్నబోనాలలో దూడపై చిరుతదాడి చేసింది. బాధితుడు బోనాల ముత్యం రాజు తెలిపిన వివరాలు. తనకున్న పొలం వద్ద నిర్మించిన పశువుల పాకలో సోమవారం రాత్రి పశువులను కట్టేసి ఇంటికెళ్లాడు. మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా దూడె మృతిచెంది ఉంది. రైతు మాట్లాడుతూ రూ.30వేలు విలువ చేసే దూడెను చిరుత చంపివేసిందని రోదించాడు. అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత పాదముద్రలను గుర్తించారు. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక కౌన్సిలర్ బొల్గం వైష్ణవినాగరాజు కోరారు.
పాఠశాలలో గ్యాస్ సిలిండర్లు, వంట సామగ్రి చోరీ
శంకరపట్నం: కొత్తగట్టు ప్రాథమిక పాఠశాలలో గ్యాస్ సిలిండర్లు, వంట సామగ్రి చోరీకి గురైనట్లు ఉపాధ్యాయులు తెలిపారు. సోమవారం విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండిన నిర్వాహకులు వంట పాత్రలు శుభ్రం చేసి వంట గదిలో పాత్రలు భద్రపర్చి తాళం వేసి ఇంటికెళ్లారు. మంగళవారం పాఠశాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు రాగా.. వంట గదికి వేసిన తాళం పగలగొట్టి ఉంది. దొంగలు 2 గ్యాస్ సిలిండర్లు, వంట పాత్రలు చోరీ చేశారు. ఓ పాత్రను పాఠశాల ఆవరణలో వదిలి వెళ్లారు. కేశవపట్నం పోలీసులు వివరాలు సేకరించారు.
హైదరాబాద్‌కు తరలిరండి
పెద్దపల్లి: హైదరాబాద్‌లో ఈనెల 14న నిర్వహించే పీడీఎస్‌యూ నేత జార్జిరెడ్డి వర్ధంతి స భను విజయవంతం చేయాలని ఆ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కూతటి రాణాప్రతాప్ కోరారు. జార్జిరెడ్డి వర్ధంతి సభ ప్రచార పోస్టర్‌ను స్థానిక నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థి ఉద్యమాలకు మార్గదర్శకుడు జార్జిరెడ్డి అన్నారు. పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు లోకిని రమేశ్, ప్రతినిధులు సుమన్, చందు, నవీన్, శ్యామ్, సంధ్య, శ్రావణి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.


