● తండ్రిని కొడుకుల చెంతకు చేర్చిన ప్రధాన న్యాయమూర్తి
● కోర్టు ఆవరణలోనే ప్రత్యేక కార్యక్రమం..
● కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్
జగిత్యాలజోన్: ఇటీవల జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్నపద్మావతి జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఇందులో కొడుకులు ఉన్నప్పటికీ ఓ తండ్రి అనాథగా ఆశ్రమంలో ఉన్నాడు. మరో చోట తల్లిదండ్రులు మరణించడంతో ముగ్గురు పిల్లలు భిక్షాటన చేస్తూ కనిపించారు. ఈ రెండు ఘటనలు ఆమెను కలచివేశాయి. ప్రత్యేకంగా చొరవ తీసుకున్న ఆమె అనాథ ఆశ్రమంలో ఉన్న మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంగారాం కొడుకులు గణేష్, గంగాధర్‌కు జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా నోటీసులు పంపించారు. ఆ ఇద్దరూ కోర్టుకు రావడంతో చిన్నతనంలో తండ్రి పెంచిన మమకారం, ఆయన పడిన కష్టాన్ని కళ్లకు కట్టినట్టు జడ్జి వారికి వివరించారు. దీంతో తమ తప్పును తెలుసుకున్న ఆ కుమారులు గంగారాంను ఇంటికి తీసుకెళ్లేందుకు ఒప్పుకోవడంతో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి అప్పగించారు. అలాగే తల్లిదండ్రులు కోల్పోయి భిక్షాటన చేస్తున్న ముగ్గురు చిన్నారులను జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా చేరదీసి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన వసతితో కూడిన విద్యాభోదన అందించేలా ఏర్పాట్లు చేశారు. చిన్నారులను కూడా ప్రత్యేక కార్యక్రమానికి పిలిచి, బాగా చదువుకుని ఉన్నతులుగా ఎదగాలని, ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని జడ్జి వారికి సూచించారు. అనుబంధాలను మించిన సంపద లేదని, ఆస్తులు పంచుకోవడమే కాకుండా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను సరిగా చూసుకోవాలన్నారు.
లోక్ అదాలత్ విజయవంతం
జిల్లా వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్‌లో 3,034 కేసులు పరిష్కారంలో చొరవ చూపిన జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి మంగళవారం ప్రశంసపత్రాలు అందించారు. అత్యధిక కేసులు పరిష్కరించి మొదటిస్థానంలో నిలిచిన జగిత్యాల పోలీస్‌స్టేషన్, రెండోస్థానంలో నిలిచిన మెట్‌పల్లి, మూడోస్థానంలో నిలిచిన రాయికల్ పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లను జడ్జిలు సన్మానించారు. పిటీ కేసుల్లో మొదటి, రెండు, మూడుస్థానాల్లో నిలిచిన జగిత్యాల, వెల్గటూర్, గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ అధికారులను సన్మానించారు. ఎస్పీ అశోక్‌కుమార్, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సుగళి నారాయణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, రెండో అదనపు జుడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజేష్, ప్రణయ్, మాజీ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, సిబ్బంది షఫీ, శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, వెంకన్న పాల్గొన్నారు.
చిన్నారులను అభినందిస్తున్న జడ్జి, ఎస్పీ
తండ్రి కాళ్లు మొక్కి ఇంటికి తీసుకెళ్తున్న కొడుకులు


