కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం జూబ్లీనగర్‌లో ఈ నెల 3న తండ్రి కచ్చు శ్రీశైలం చేతిలో హత్యకు గురైన కవల పిల్లలు గీతాన్‌శ్రీ, గీతాన్వికలకు మంగళవారం పిట్టకు పెట్టగా ఎక్కడి నుంచో రెండు నల్లకుక్కలు వచ్చి ఆహారం తినడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో ఎవరైనా చనిపోతే మూడు, ఐదు రోజుల్లో కుటుంబసభ్యులు పిట్టకు పెట్టే సంప్రదాయం ఉంది. చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహారం తయారు చేసి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో కవలలు మృతిచెంది మంగళవారం ఐదవ రోజు కావడంతో తల్లి మౌనికతో పాటు బంధువులు పొలంలో పూడ్చిపెట్టిన బొందల వద్దకు వచ్చారు. పిల్లలకు ఇష్టమైన ఆహారం, చాక్లెట్లు, బిస్కెట్లు ఇతర ఆహార పదార్థాలను విస్తారాకుల్లో పెట్టి సమాధిపై పెట్టారు. పిట్ట కోసం ఎదురుచూస్తుండగా ఒకే రకం రెండు నల్లకుక్కలు వచ్చి ఆహారాన్ని తినడం ప్రారంభించాయి. కాగా, తన ఇద్దరు బిడ్డలు నల్లకుక్కల రూపంలో వచ్చారంటూ తల్లి మౌనిక రోదించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కంటతడి పెట్టారు. బతికున్నప్పుడు పిల్లలను ఒక్కరోజైనా సరిగా చూసుకోని తండ్రి శ్రీశైలంపై శాపనార్థాలు పెట్టారు.


