ఎట్లున్నవ్‌ రాజన్నా.. | - | Sakshi
Sakshi News home page

ఎట్లున్నవ్‌ రాజన్నా..

Apr 8 2026 8:14 AM | Updated on Apr 8 2026 8:14 AM

స్వగ్రామానికి మావోయిస్ట్‌ మల్లా రాజిరెడ్డి

ఆప్యాయతతో పలకరించిన శాస్త్రుల్లపల్లి గ్రామస్తులు

మంథనిరూరల్‌: ‘ఎన్నాళయ్యింది చూసి.. ఎట్లున్నవ్‌ రాజన్నా’ అని మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌ను శాస్త్రులపల్లి గ్రామస్తులు పలకరించారు. మావోయిస్టు పార్టీని వీడి ఇటీవల జనజీవనంలోకి వచ్చిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి తన స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని శాస్త్రులపల్లికి మంగళవారం వచ్చారు. మావోయిస్టు పార్టీని వీడిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. ఎప్పుడు తమ గ్రామానికి వస్తాడా.. ఎప్పుడు ఆయనను చూస్తామా.. అని ఎదురు చూస్తున్న క్రమంలో మంగళవారం వచ్చిన ఆయనను గ్రామస్తులు ఆప్యాయతతో పలకరించారు. చిన్నాపెద్దా, తేడా లేకుండా ఆయనను పలకరిస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. రాజిరెడ్డి ఉద్యమంలో వెళ్లిన స మయంలో యువకులుగా ఉన్నవాళ్లంతా ఆయనను కలుసుకుని కాసేపు ముచ్చటించారు. అయితే తన ఆరోగ్య సమస్యలతో అజ్ఞాత జీవితాన్ని వీడి బయటకు వచ్చినట్లు మీడియాకు తెలిపారు.

మల్లాను కలిసిన మాజీ ఎమ్మెల్యే

మల్లా రాజిరెడ్డి ఉరఫ్‌ సంగ్రామ్‌ 40ఏళ్ల తర్వాత తొలిసారి తన స్వగ్రామమైన మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌ గ్రామ పంచాయతీ పరిధి శాస్త్రులపల్లికి రాగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆయనను కలిసి మాట్లాడారు. మావోయిస్టు ఉద్యమంలో అనుభవాలు, ఎదురైన సంఘటనలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. నాయకులు తగరం శంకర్‌లాల్‌, లొడారి రాములు తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement