నిజాయతీ చాటుకున్న వ్యాపారి | - | Sakshi
Sakshi News home page

నిజాయతీ చాటుకున్న వ్యాపారి

Apr 4 2026 7:31 AM | Updated on Apr 4 2026 7:31 AM

యైటింక్లయిన్‌కాలనీ: రామగుండం కార్పొరేషన్‌లోని యైటింక్లయిన్‌కాలనీలో రెగ్జిన్‌ బ్యాగులు కుట్టే హాపిజిల్లాఖాన్‌ ఓ బ్యాగులో లభించిన దాదాపు 5 తులాల బంగారు నెక్లెస్‌ను యజమానికి అందించి నిజాయతీ చాటుకున్నారు. బ్యాగు కుట్టుమని తోటపల్లి యాదగిరిరావు ఆయనకు ఇటీవల అప్పగించాడు. దానిని కుడుతున్న క్రమంలో 5 తులాల నెక్లెస్‌ లభ్యమైంది. దానిని వెంటనే యాదగిరి రావుకు ఫోన్‌చేసి అప్పగించారు. ఖాన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు స్థానిక అబ్దుల్‌ కలాం స్టేడియంలో వాకర్స్‌, యోగా సోసియేషన్‌ సభ్యులు శుక్రవారం ఖాన్‌ను అభినందించి సన్మానించారు. ఈకార్యక్రమంలో వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రేసవేన కేశవులు, ఉపాధ్యక్షుడు సంపత్‌, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మాజీ కౌన్సిలర్‌ దుర్మరణం

రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే వంతెన సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ కౌన్సిలర్‌ రంగు భారతి(50) దుర్మరణం చెందారు. అంతర్గాం నుంచి గోదావరిఖని వెళ్తుండగా స్థానిక రైల్వే వంతెనపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో రంగు భారతి–బ్రహ్మం దంపతులు కిందపడిపోయారు. భారతి ఎగిరి కిందపడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. భర్త బ్రహ్మం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై సంధ్యారాణి తెలిపారు.

కాలువలో పడి ఇద్దరు..

హుజూరాబాద్‌రూరల్‌/పెద్దపల్లి రూరల్‌: మున్సిపల్‌ పరిధి ఇప్పలనర్సింగాపూర్‌కు చెందిన కస్తూరి రాధ(47) శుక్రవారం ప్రమాదవశాత్తు కాకతీయ ప్రధాన కాలువలో పడి మృతి చెందింది. సీఐ కరుణాకర్‌, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. బట్టలు ఉతికేందుకు కెనాల్‌ వద్దకు వెళ్లగా కాలుజారి రాధ కాలువలో పడిపోయింది. నీటి ఉధృతికి కొట్టుకపోయి పెద్దపాపయ్యపల్లి శివారులో తేలడంతో గ్రామస్తులు పైకి తీసుకువచ్చారు. అప్పటికే ఆమె మృతి చెందిందని, కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు.

పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామానికి చెందిన కొంతం నాగరాజు(28) ఎస్సారెస్పీ కాలువలో పడి దుర్మరణం పాలయ్యాడు. నాగరాజు ద్విచక్రవాహనం, చెప్పులు చందపల్లి కెనాల్‌ వద్ద లభించగా.. మృతదేహం ముత్తారం గ్రామశివారులో కనుగొన్నట్టు ఎస్సై మల్లేశ్‌ తెలిపారు. మృతుడి తల్లి రాధమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. కాగా, తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నట్టు రాధమ్మ పేర్కొనగా.. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని గ్రామస్తులు చెబుతున్నారు.

రాఘవాపూర్‌లో..

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌ గ్రామానికి చెందిన రెహాన(56) శుక్రవారం రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. తనకు అవసరమైన కిరాణ సామగ్రి కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా బైక్‌ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement