సిరిసిల్ల: సిరిసిల్ల చేనేత కళాకారుడు విజయ్‌కుమార్ నేసిన అగ్గిపెట్టెలో ఇమిడే చీర ఆకట్టుకుంది. హైదరాబాద్‌లోని ఏషియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్‌లో సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్ నేసిన అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఇక్కత్ పట్టు చీరలను ప్రదర్శించారు. వివిధ దేశాల నుంచి ప్రముఖులు ఈ కాన్ఫరెన్స్‌కు రాగా.. సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేశారు. చీర పొడవు ఆరు మీటర్లు, వెడల్పు 48 ఇంచులు. దీన్ని పూర్తి పట్టు దారాలు, జరీతో తయారు చేశారు. బరువు 250 గ్రాములు ఉంది.
చిగురుమామిడి: హైనా దాడిలో లేగదూడలు, మేక పిల్లలు మృతిచెందాయి. మండలంలోని సుందరగిరి గ్రామానికి చెందిన రైతు గండికోట పెద్దశ్రీనివాస్ వ్యవసాయ బావి వద్ద రోజు మాదిరిగానే గురువారం సాయంత్రం పాడిఆవులు, లేగదూడలు, మేక పిల్లలను కట్టేసి ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం వెళ్లేసరికి లేగదూడలు, మేక పిల్లలు మృతి చెంది ఉన్నాయి. సమాచారం అందుకున్న ఫారెస్టు సెక్షన్ అధికారి శేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హైనా దాడిలో మృతిచెందవచ్చని పరిహారం కోసం మీసేవాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరారు.
రెగ్యులర్‌గా వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
రామగుండం: పెద్దపల్లి–నిజామాబాద్ నుంచి నడిచే నాందేడ్–తిరుపతి(07015/16), నాందేడ్–ధర్మవరం(07189/90) వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రైళ్లకు కొత్త నంబర్లు కేటాయించారు. ప్రస్తుత రైలు నంబరు 17633/34(నాందేడ్–తిరుచానూరు –తిరుపతి) ఇరువైపులా వారాంతపు రైలుగా రాకపోకలు సాగించనుంది. దీనికి బాసర, నిజామాబాద్, కోరుట్ల, లింగంపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబ్‌బాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.
టాటాఏస్‌లో మంటలు
తిమ్మాపూర్: కరీంనగర్ నుంచి సిద్దిపేటకు ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్ ఆటో తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్ద మంటల్లో కాలిపోయింది. ఆటోలో ఇంజిన్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ హైమద్ పాషా ఆటోను పక్కకు ఆపి, అందులోని ప్రయాణికులను సురక్షితంగా దింపాడు. ఇంజిన్‌ను పరిశీలిస్తుండగా మంటలు మరింత ఎక్కువయ్యాయి. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కరీంనగర్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్ మంటలను ఆర్పేసింది. అప్పటికే ఆటో పూర్తిగా కాలిపోయిందని డ్రైవర్ అహ్మద్ పాషా తెలిపారు. ప్రమాద సమయంలో ఆటోలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు.


