ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం ● ఆరవెల్లిలో విషాదం
జగిత్యాలక్రైం/మేడిపల్లి: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల శివారులో జగిత్యాల–కోరుట్ల ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాలు ఇలా.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఆరెవెల్లికి చెందిన గాలిపెల్లి ఆదిత్య (20) అతని మిత్రుడు మహారాష్ట్రలోని బీవండికి చెందిన విఘ్నేష్(19)తో కలిసి మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో జరిగిన పుట్రు వెంటుకల కార్యక్రమంలో పాల్గొని ద్విచక్రవాహనంపై తిరిగి స్వగ్రామం వెళ్తుండగా, మేడిపల్లి శివారులో ప్రధాన రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. ఆదిత్య తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, విఘ్నేష్‌ను 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, విఘ్నేష్ మహారాష్ట్రలోని బీవండికి చెందిన వ్యక్తి కాగా, రెండు రోజుల క్రితం ఆరవెల్లిలోని అమ్మమ్మ వద్దకు వచ్చాడు. ఆదిత్య, విఘ్నేష్ ఇద్దరు స్నేహితులు కావడంతో ఇద్దరు కలిసి, ద్విచక్ర వాహనంపై శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఆరవెల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఆదిత్య తండ్రి ఇజ్రాయల్‌లో ఉంటుండగా వారికి ఒకే కుమారుడు. అలాగే విఘ్నేష్ కూడా తల్లిదండ్రులకు ఒకే కుమారుడు కావడంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకోవడంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను చూసి తీవ్రంగా రోదించారు. విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, విచారణ చేపట్టారు.


