గన్నేరువరం: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గురువారం జరిగిన గ్రామసభలో ఓ యువకుడు కంకరతట్టు పట్టుకుని నిరసన తెలిపాడు. రాజీవ్ రహదారిపై గల గుండ్లపల్లి స్టేజీ నుంచి గన్నేరువరం మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులను వెంటనే పూర్తిచేయాలని బీఆర్‌ఎస్ యువజన విభాగం మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేశ్ డిమాండ్ చేశారు. పనులకు ఉపయోగించే కంకరరాళ్లను తట్టలో వేసుకుని గ్రామసభకు హాజరై నల్లబ్యాడ్జీతో నిరసన తెలిపాడు. గునుకులకొండాపూర్ నుంచి జంగపల్లి వరకు చేపట్టిన రోడ్డుపై కంకర ఉందని, దీనిద్వారా ఉన్న రాకపోకలకు ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపాడు. డబుల్‌రోడ్డు పూర్తిచేయాలని ఇంకా ఎన్నిసార్లు మంత్రులను కలుస్తారని ప్రశ్నించాడు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులను విడుదల చేయించి పనులను పూర్తిచేయించాలని అతడు కోరాడు. ఇందుకోసం గ్రామసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశాడు.
కంకరతట్టతో గ్రామసభలో ఆందోళన


