కరీంనగర్: ఉరేసుకుని వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మేరుగు రామయ్య (90) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మందులు వాడినా నయం కాలేదు. ఫిబ్రవరి 27న పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం తప్పిందనుకుంటున్న తరుణంలో మంగళవారం రాత్రి ఆయన భార్య గ్రామంలోనే ఉంటున్న కుమారుడి ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న రామయ్య ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.
జగిత్యాల పరిధిలో యువకుడు..
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన మునుగురి పవన్ (26) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ ఇంటర్ పూర్తి చేసి పోలీస్ కానిస్టేబుల్ కోసం కోచింగ్ తీసుకుని పరీక్ష రాశాడు. జాబ్ రాకపోవడంతో ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తూ ఉన్నత చదువులు చదువుతున్నాడు. పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నానన్న మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.


