ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

కొత్తపల్లిలో యువకుడు.. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

చిగురుమామిడి(హుస్నాబాద్‌): మండలంలోని చిన్నముల్కనూర్‌ గ్రామానికి చెందిన మెడవేని రాధిక (25) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై పృథ్వీధర్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. మండలంలోని సుందరగిరి గ్రామానికి చెందిన రాధికను 2021లో చిన్నముల్కనూర్‌కు చెందిన రమేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి మూడేళ్ల కూతురు మనస్విని ఉంది. అదనపు కట్నం తేవాలంటూ రాధికను తరుచూ భర్త రమేశ్‌, అత్త కమలవ్వ వేధింపులకు గురిచేసేవారు. వేధింపులు తట్టుకోలేక సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా చుట్టుపక్కల వారు గమనించి 108లో కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కొత్తపల్లి(కరీంనగర్‌): కరీంనగర్‌ నగరపాలక సంస్థ 18వ డివిజన్‌ కొత్తపల్లికి చెందిన కొత్త శ్రావణ్‌ (26) మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌, ట్రైనీ ఐపీఎస్‌ అధికారి తెలిపిన వివరాలు.. కొత్తపల్లికి చెందిన శ్రావణ్‌ ఐదునెలల క్రితం జరిగిన ప్రమాదంలో కాలు విరిగి ఇంటి వద్దే ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.

కరీంనగర్‌క్రైం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలు.. నగరంలోని రాంనగర్‌లో నివాసముంటున్న ఇస్లావత్‌ కిషన్‌(55) మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం తన సొంత గ్రామం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం జ్యోతిరాంనాయక్‌ తండాకు వెళ్లాడు. మంగళవారం సాయంత్రం కరీంనగర్‌కు వస్తుండగా, అల్గునూర్‌ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వెనకనుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి అల్లుడు రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు

తిమ్మాపూర్‌: పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎల్‌ఎండీ ఎస్సై అన్వర్‌ తెలిపారు. బ్లూకోల్డ్స్‌ సిబ్బంది అనిల్‌, రఘురాంరెడ్డి అలుగునూర్‌ వద్ద మంగళవారం రాత్రి పెట్రోలింగ్‌ చేస్తున్నారు. అదే ఏరియాకు చెందిన చుంచు అంజి అనే వ్యక్తి చౌరస్తా వద్ద రాంగ్‌ రూట్‌ వస్తుండడంతో పోలీసులు ఆపారు. దీంతో యువకుడు రెచ్చిపోయి నా ఊరు.. నా ఇష్టం అంటూ పోలీసులతో వాదిస్తూ సిబ్బందితో గొడవకు దిగాడు. పోలీసుల ఫిర్యాదుమేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సయ్యద్‌ అన్వర్‌ వివరించారు.

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు

రోడ్డుపక్కకు దూసుకెళ్లి ఆగిన వైనం

జ్యోతినగర్‌: పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ ఒకటో డివిజన్‌ న్యూపీకే రామయ్య కాలనీ సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఉదయం గోదావరిఖని నుంచి లింగాపూర్‌ మోడల్‌ స్కూల్‌కు విద్యార్థులను తీసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. అక్కడ విద్యార్థులను దించి గోదావరిఖని వైపు వస్తోంది. ఈక్రమంలో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకు వెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌, కండక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

వైభవంగా

గజ వాహన సేవ

ఇల్లందకుంట : సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి గజ వాహన సేవ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు శేషం వంశీధారాచార్యుల ఆధ్వర్యంలో ఉత్సవ మూర్తులను అలంకరించి గజ వాహన సేవ కార్యక్రమం చేపట్టారు. స్వామివారిని ఆలయ మాడ వీధుల మీదుగా ఊరేగించారు. భక్తుల రామ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement