తిమ్మాపూర్: రైతులు ఆధునిక వ్యవసాయం చేస్తేనే మనుగడ ఉంటుందని పలు జిల్లాల వ్యవసాయ అధికారులు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలోని కరీంనగర్‌కు చెందిన తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం(టీఆర్వీకే), జగిత్యాల వ్యవసాయ కళాశాల, రాజన్న సిరిసిల్ల జిల్లా బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలల ఆధ్వర్యంలో తిమ్మాపూర్‌లో శనివారం రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన, వివిధ పంటల సాగులో సాంకేతిక, సమగ్ర యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలు, రైతులతో చర్చాగోష్టి నిర్వహించారు. కరీంనగర్ డీఏవో భాగ్యలక్ష్మీ, సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల వ్యవసాయాధికారులు భాగ్యలక్ష్మీ, భాస్కర్, ఛత్రునాయక్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయ సాగులో మెలకువలు నేర్చుకోవాలని తెలిపారు. ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ నాణ్యమైన పంటలు పండించాలని, ఒక్కో రైతు తనకున్న పొలంలో కొంత మేరకై నా సేంద్రియ వ్యవసాయ చేయాలని సూచించారు. ప్రభుత్వం వద్ద మూడేళ్లకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయని, అందుకే దొడ్డు రకం పండించొద్దని సూచించారు. ఆయిల్‌పాం పంటలపై దృష్టి పెట్టి వాటిసాగు విస్తీర్ణం పెంచాలన్నారు. ఇందుకు మన భూములు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. మిగులు ఎక్కువగా ఉండే ఆయిల్ ఫామ్ లాభదాయకంగా ఉందన్నారు. యూనివర్సిటీల్లో ఎరువుల వినియోగంపై రీసెర్చ్ జరుగాలని కోరారు. నానో యూరియా వాడాలని సూచించారు. మోటార్లకు సోలార్ పవర్ వినియోగించాలని, రాబోయే రోజుల్లో పంట చేనులకు సైతం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సీడీ రుణాలు ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ రైతులను అధికారులు సన్మానించారు. ఏడీ శ్రీధర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు సునీతాదేవీ, వ్యవసాయ పరిశోధన కేంద్రం హెడ్ రాంప్రసాద్, శాస్త్తవేత్తలు మధుకర్, హరిక్రిష్ణ, రాజేంద్రప్రసాద్, ఏవోలు సురేందర్, వెంకటేశ్, కిరణ్మయి, పూర్ణచందర్ పాల్గొన్నారు.
రైతులకు సూచనలు చేసిన డీఏవోలు
తిమ్మాపూర్‌లో రైతులతో చర్చాగోష్టి


