కరీంనగర్ అర్బన్: ఎన్నడూ లేని విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం ఏకకాలంలో చేరడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఎకరాకు రూ.2వేల సాయం అందించింది. ఆదివారం నుంచి రైతు భరోసా సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతాల్లో జమ చేస్తోంది. జిల్లాలో 2,14,311 మంది రైతులకు ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.197.10కోట్ల నగదు నేటి నుంచి జమకానుంది. జిల్లాలో ఎక్కువమంది రైతులు వరితో పాటు ఇతర పంటలు సాగుచేస్తుంటారు. గత పట్టాదారుల సంఖ్యతో పాటు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులకు రైతు భరోసా వర్తింపజేశారు. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూరు వ్యవసాయ డివిజన్లుండగా ఏఈవోలు అప్‌డేట్ చేసిన వివరాల ప్రకారం నేరుగా ఖాతాలకు జమ చేస్తున్నారు. తొలుత చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుండగా తదుపరి పెద్ద రైతులకు చేరుతాయని అధికారులు వెల్లడించారు. భూభారతి పోర్టల్ వివరాలు, ఖాతా వివరాలిచ్చిన రైతుల ప్రకారం వ్యవసాయ విస్తరణ అధికారులు లాగిన్‌లో క్రోడీకరించారు. సదరు వివరాల క్రమంలో పెట్టుబడి సాయం పడుతుందని వివరించారు.
కొత్తగా 10వేల మంది
పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ధరణి పోర్టల్‌లో నమోదైన రైతుల జాబితాను వ్యవసాయశాఖ సేకరించింది. ఈ నెల 25 వరకు అవకాశముండగా భూములు కొన్న, కుటుంబాల్లో భూ పంపకాలతో కొత్తగా పేర్లు నమోదైన వారి పేర్లను ఇటీవల వ్యవసాయ విస్తరణ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. రైతుభరోసా పథకంలో యాసంగి సీజన్‌కు కొత్తగా 10వేల మంది రైతులు అర్హత పొందారు. హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్, గంగాధర, రామడుగు, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల్లో కొత్తగా నమోదైన రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది.
కిసాన్ సమ్మాన్ రూ.21.92కోట్లు
జిల్లా రైతులకు ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద పెట్టుబడి సాయం వచ్చింది. 1,09,598 మంది రైతులకు రూ.21.92కోట్లు ఖాతాకు చేరాయి. ఇప్పటివరకు ఆరు విడతల్లో నగదు పంపిణీ కాగా ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున ఖాతాల్లో జమ చేసింది. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6వేల చొప్పున మూడు విడతల్లో చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి విడతలో 72,939 మంది రైతులు రూ.14.58కోట్లు లబ్ధి పొందారు. రెండో విడతలో 93,763 మందికి రూ.18.75కోట్లు చేరాయి. మూడో విడతలో 96,558 మందికి రూ.19.31కోట్లు, నాలుగో విడతలో 1,03,024 మంది రైతులకు రూ.20.60కోట్లు, ఐదో విడతలో 1,06,558 మంది రైతులకు రూ.21.31కోట్లు వచ్చాయి. ఆరవ విడతలో 1,09,598 మంది లబ్ధి పొందారు.
జిల్లా వివరాలు
రెవెన్యూ గ్రామాలు: 206
పోర్టల్‌లో పట్టాదారులు: 214311
విడుదల కావాల్సిన నగదు:
రూ.197.10కోట్లు


