బల్దియా బాద్‌షా ఎవరో?
కార్పొరేషన్ పగ్గాలు చేపట్టనున్న బీజేపీ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ పోటీ పడుతున్న బీసీ నేతలు రేసులో రెండు మూడుసార్లు గెలిచిన కార్పొరేటర్లు మహిళలకు అవకాశంపై కూడా పార్టీలో ఆలోచన కేంద్ర మంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మేయర్ పీఠంపై ఉత్కంఠ మొదలైంది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో 66 కార్పొరేటర్ స్థానాలకు బీజేపీ 30 స్థానాలను గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే మరో నలుగురు కార్పొరేటర్లు అవసరముండగా... ఇప్పటికే ఇండిపెండెంట్లు ముగ్గురు, ఒక ఎఐఎఫ్‌బీ కార్పొరేటర్ కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను తాకింది. మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారం బీజేపీ వైపు ఒరిగిన నేపథ్యంలో మేయర్ పీఠాన్ని అధిష్టించేది ఎవరో అన్న ఆసక్తి నగర ప్రజల్లో నెలకొంది. ఫలితాల అనంతరం బీజేపీ శ్రేణుల్లో జోష్ పెరిగినా, మేయర్ పదవిపై అంతర్గత పోటీ ఆసక్తికరంగా మారింది.
కేంద్ర మంత్రి ప్రసన్నం కోసం
మేయర్ పదవి బీసీ జనరల్‌కు కేటాయించిన విషయం విధితమే. అధికార పగ్గాలు చేపట్టే స్థితికి చేరుకున్న బీజేపీలో మేయర్ రేసులో పలువురు సీనియర్ బీసీ కార్పొరేటర్లు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌తో ఆశావహులు వరుసగా భేటీలు అవుతూ తమకు మేయర్ పదవి ఇవ్వాలంటూ వినిపిస్తున్నట్లు సమాచారం. పార్టీకి విధేయతతో పనిచేసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని ఒకవర్గం భావిస్తుండగా, సామాజిక సమీకరణాలు, మహిళా ప్రాతినిధ్యం, అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకునే వరకు మేయర్ అభ్యర్థిత్వంపై స్పష్టత రానప్పటికీ, అంతర్గత లాబీయింగ్ జోరుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రచారం నుంచి పబ్లిసిటీ వరకు అన్ని తానై అత్యధిక కార్పొరేటర్లను గెలిపించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ నిర్ణయమే ఫైనల్ కావడంతో ఎవరికి అవకాశం ఇస్తారో అనే ఆసక్తి నెలకొంది. మొత్తానికి, కరీంనగర్ మేయర్ పీఠాన్ని అధిష్టించేది ఎవరో అన్న ఉత్కంఠ నగర రాజకీయాలను వేడెక్కిస్తోంది.
చొప్పరి జయశ్రీ
బండారి వేణు
వాసాల రమేశ్
కొలగాని శ్రీనివాస్
మేయర్ రేసులో బీసీ నేతలు
సోమవారం మేయర్ పదవికి ఎన్నిక జరగనుండడంతో పీఠం అధిష్టించేది ఎవరనేది నగర ప్రజల్లో ఆసక్తిగా మారింది. మేయర్ పదవి ఆశిస్తున్న వారిలో ఆర్‌ఎస్‌ఎస్ నుంచి బీజేపీలో విధేయతతో పనిచేస్తున్న 2వ డివిజన్ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్, సీనియర్ నాయకుడు 18వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన వాసాల రమేశ్, మరో సీనియర్ నాయకుడు 51వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన బండారి వేణు మేయర్ రేసులో ఉండగా, మహిళలకు అవకాశమిస్తే సీనియర్ కార్పొరేటర్ 12వ డివిజన్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ మేయర్ పదవి ఆశిస్తూ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.


