యువతరానికి పట్టం | - | Sakshi
Sakshi News home page

యువతరానికి పట్టం

Feb 15 2026 6:56 AM | Updated on Feb 15 2026 6:56 AM

యువతరానికి పట్టం

యువతరానికి పట్టం

● అన్ని పార్టీల నుంచి యువతకే టికెట్ల కేటాయింపు ● రెండోసారి గెలిచింది ఒక్కరే ● రేపు చొప్పదండి పాలకవర్గం ఎన్నిక

చొప్పదండి: పురపాలక సంఘం ఏర్పడిన తర్వాత జరిగిన రెండో పాలకవర్గ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు యువతకు పట్టం కట్టారు. 14 వార్డుల్లో గెలిచిన కౌన్సిలర్లు 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసువాళ్లే కావడం విశేషం. శుక్రవారం ఫలితాలు వెలువడిన అనంతరం మెజారిటీ స్థానాలు సాధించిన కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు క్యాంపుకు తరలివెళ్లిన తరుణంలో సోమవారం ఉదయం జరుగనున్న పాలకవర్గ ఎన్నికల్లో చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల కోసం సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల్లోనూ యువతరమే కొలువు తీరనుంది. పట్టణంలో పద్నాలుగు వార్డులుండగా ఎనిమిది మంది మహిళలే గెలుపొందడం గమనార్హం.

మరోసారి పాలకవర్గంలోకి

14వ వార్డు నుంచి పెరుమాండ్ల మానస వరుసగా రెండో సారి కౌన్సిలర్‌గా గెలుపొందింది. గత పాలకవర్గంలో ఉన్న రాజన్నల ప్రణీత స్థానంలో ఆమె భర్త రాజన్నల రాజు గెలుపొందగా, కొట్టె అశోక్‌ స్థానంలో ఆయన సతీమణి కొట్టె సునీత కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఇక గత పాలకవర్గంలో చైర్‌పర్సన్‌గా పని చేసిన గుర్రం నీరజ కుమారుడు గుర్రం సుజిత్‌ రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో పదోవార్డు నుంచి గెలుపొందారు.

నాడు పరాజితులు.. నేడు విజేతలు

చొప్పదండి మున్సిపాలిటీకి 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం చెందిన పలువురు అభ్యర్థులు తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. గతంలో ఆరోవార్డులో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కనమల్ల రాజశేఖర్‌ తాజాగా 4వ వార్డులో పోటీ చేసి గెలుపొందారు. గతంలో 5వ వార్డులో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన ఒలుగొత్తుల సురేశ్‌ తాజాగా 6వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు. 11వ వార్డు నుంచి గతసారి బీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన పిట్టల వెంకటేశ్‌ మళ్లీ అదేస్థానం నుంచి రిజర్వేషన్‌ కలిసి రావడంతో పోటీ చేసి గెలుపొందారు. పన్నెండో వార్డులో గతంలో పోటీచేసి ఓడిపోయిన ముద్దం తిరుపతిగౌడ్‌, తాజాగా తన సతీమణిని అదేస్థానంలో పోటీకి నిలిపి గెలిపించారు. ఇలా గత ఎన్నికల్లో పరాజితులైన నలుగురు అభ్యర్థులు ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుండి పోటీ చేసి గెలుపొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement