● తొలి ఫలితం 64వ డివిజన్‌కు చాన్స్
కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు 66 డివిజన్లకు గాను 66 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 33 మంది ఆర్‌వోలు, రెండు డివిజన్ల చొప్పున నేరుగా పర్యవేక్షిస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఈ నెల 7,8,9 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం ఇవ్వగా, 66 డివిజన్లకు 2,855 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. అనంతరం బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడుతారు. బ్యాలెట్ బాక్స్‌ల సీల్ అభ్యర్థులు, ఏజెంట్ల ముందు తొలగించి, బ్యాలెట్ పత్రాలు తీస్తారు. 25 బ్యాలెట్ పత్రాలకు ఒక బండెల్ చొప్పున కట్టలు కడుతారు. వేయి ఓట్లకు ఒక రౌండ్ చొప్పున లెక్కిస్తారు. ఉదయం 8 గంటలకు ప్రక్రియ ప్రారంభమైనా, 10 గంటల తరువాతనే ఒరిజినల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వేయికి ఒక రౌండ్ చొప్పున లెక్కిస్తున్నందున, మొత్తంగా నాలుగైదు రౌండ్లలో అన్ని డివిజన్ల ఫలితాలు పూర్తికానున్నాయి. కొన్ని డివిజన్లు మూడు రౌండ్‌లలోనే ముగియనున్నాయి. సాయంత్రం 4 గంటలవరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మొదటగా 227 ఓట్లు పోలైన 64వ డివిజన్, చివరగా 4,795 ఓట్లు పోలైన 8వ డివిజన్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. కాగా సిబ్బంది లెక్కింపుతోనూ సమయం మారే అవకాశముంది.


