కౌంటింగ్‌కు మూడంచెల భద్రత
కేంద్రాల వద్ద సంబరాలు నిషేధం
సీపీ గౌస్ ఆలం
66 టేబుళ్లు.. 300 మంది సిబ్బందితో లెక్కింపు
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్
కరీంనగర్‌క్రైం/కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎస్సారార్ కళాశాల వద్ద ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలీసుల ఆధ్వర్యంలో మూడంచెల పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు. ప్రత్యేక పాసులున్నవారు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులను మాత్రమే సెంటర్‌లోకి అనుమతించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబరాలు, నిరసనలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6గంటల వరకు కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండిలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు.
దారిమళ్లింపు చర్యలు
లెక్కింపు కేంద్రం ఎస్సారార్ కళాశాల వద్ద రద్దీని నివారించేందుకు శుక్రవారం నగరంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి తెలిపారు. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపుకు వచ్చే వాహనాలు రేకుర్తి చౌరస్తా, శాతవాహన యూనివర్సిటీ, కొత్తపల్లి పోలీసుస్టేషన్ రోడ్డు మీదుగా చింతకుంట నుంచి నగరంలోకి చేరుకుంటాయన్నారు. కరీంనగర్ నుంచి జగిత్యాల వైపుకు వెళ్లే వాహనాలు తెలంగాణ చౌక్, రాంనగర్, పద్మనగర్, చింతకుంట మీదుగా శాతవాహన యూనివర్సిటీ, రేకుర్తి నుంచి జగిత్యాల వైపునకు వెళ్లాలని సూచించారు.
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
నగరపాలక సంస్థ 66 డివిజన్‌ల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశామని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. గురువారం కౌంటింగ్ కేంద్రమైన ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సీపీ గౌస్ ఆలం సమక్షంలో మాస్టర్ శిక్షకులు కౌంటింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్‌దేశాయి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు 66 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఓట్ల లెక్కింపునకు సూపర్‌వైజర్లు, అసిస్టెంట్ సూపర్ వైజర్లు కలుపుకొని మొత్తం 300 మంది సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. మొత్తం 66 టేబుళ్లు ఏర్పాటు చేస్తామని, మొదటగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం జరుగుతుందని అన్నారు. వేయి ఓట్లకు ఒక రౌండ్ చొప్పున లెక్కించి, ఫలితాలు వెల్లడించడం జరుగుతుందన్నారు.


