పుర.. పలోభాల ఎర!
మొదలైన ప్రలోభాల పర్వం
కుల సంఘాలపై నజర్
పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ మారుతున్న పొలిటికల్ సీన్
కరీంనగర్‌టౌన్: మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. పోలింగ్‌కు మరో 24 గంటల గడువు మాత్రమే ఉండడంతో ఇక రాజకీయ సీన్ రసవత్తరంగా మారబోతోంది. ఓటర్లే లక్ష్యంగా అన్ని రకాల ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం మొదలు పెట్టాయి. ఇప్పటి వరకు బహిరంగ ప్రచారంతో హోరెత్తించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇక ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. బహిరంగ ప్రచారానికి సోమవారం సాయంత్రం వరకు గడువు ముగియడంతో అంతర్గత ప్రచారంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
ప్రచారాల జోరు
ఇదిలా ఉండగా కాంగ్రెస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి చొప్పదండిలో ప్రచారం నిర్వహించగా, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సీనియర్ నాయకుడు వీహెచ్ హనుమంతరావు, హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు విస్త్రృత ప్రచారం చేశారు. బీజేపీ తరఫున కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నీ తానై ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని సుడిగాలి పర్యటన చేశారు. మాజీ ఎంపీ, సినినటీ నవనీత్‌కౌర్ ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ప్రచారంలో పాల్గొన్నారు. ఎంఐఎం పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ పక్షాన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, పంజాల శ్రీనివాస్, ఏఐఎఫ్‌బీ పక్షాన రాష్ట్ర కార్యదర్శి అంబటి జోజిరెడ్డి, బీఎస్పీ పక్షాన ఎంపీ సుందర్‌పాల్ తదితరులు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.
బహిరంగ ప్రచారానికి తెర
మున్సిపల్ ఎన్నికల బహిరంగ ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడింది. రోడ్‌షోలు, ఇంటింటా ప్రచారాలు, మైక్‌లు, లౌడ్ స్పీకర్‌లతో ఎన్నికల ప్రచారం రక్తికట్టింది. బహిరంగ ప్రచారం ముగియడంతో అభ్యర్థులు నేరుగా ఓటర్లను కలిసి ఓటు కోసం ప్రాధేయపడనున్నారు. గంపగుత్తగా కుల సంఘాల ఓట్లను సాధించేందుకు పావులు కదుపుతున్నారు. ఓటర్లను నయానో, బయానో ఒప్పించి వారి మద్దతు కూడగట్టాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఎన్నికలకు ఒక్కరోజు గడువు ఉండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాల పర్వం మొదలు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. మందు, విందు, వినోదాలతో ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున మద్యం కొనుగోళ్లు జరిగాయి. మద్యం పంపిణీకి అన్నిరకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మున్సిపల్ ప్రచారం పరిసమాప్తం


