116 ప్రాంతాలు.. 477 కేంద్రాలు
కరీంనగర్ కార్పొరేషన్: నగర ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకునేందుకు 66 డివిజన్లలోని 116 ప్రాంతాల్లో 477 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇందులో 120కి పైగా సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. పోలీసులు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించారు. 66 డివిజన్లకు గాను 33 రూట్లను నిర్ణయించాం. రూట్‌కు ఒకరు చొప్పున 33 మంది జోనల్ అధికారులను నియమించి శిక్షణ ఇచ్చాం. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ అయిన ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల నుంచి 33 రూట్ల ద్వారా వంద బస్సుల్లో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి.. తిరిగి వస్తారు.
కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం
పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాం. 477 పోలింగ్ కేంద్రాల లోపల, 160 చోట్ల పోలింగ్ కేంద్రాల ఆవరణలో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈ వెబ్ కెమెరాలను నగరపాలకసంస్థ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశాం. పోలింగ్ రోజు కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితిని సమీక్షించడానికి వీలవుతుంది. పోలింగ్ కేంద్రాలు, బయట వెబ్‌కాస్టింగ్‌తో పోలింగ్ సరళిని పరిశీలిస్తాం.
పది మోడల్ కేంద్రాలు
నగరంలోని 477 పోలింగ్ కేంద్రాల్లో పది మోడల్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వేర్వేరు కేటగిరీల్లో ఈ పది మోడల్‌కేంద్రాలు ఉంటాయి. పర్యావరణం, స్వచ్ఛసర్వేక్షణ్, కరీంనగర్ హిస్టారికల్, మహిళా ఫ్రెండ్లీ, దివ్యాంగుల ఫ్రెండ్లీ మోడల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం.
3 వేల మంది సిబ్బంది
ఆర్‌వోలు, పీవోలు, ఏపీవోలతో పాటు మూడు వేల మంది సిబ్బందిని నియమించాం. వీరంతా పోలింగ్ ప్రక్రియను చేపడుతారు. వీరితో పాటు దాదాపు వేయిమందికి పైగా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఉంటుంది. ఆయా డివిజన్ల వారీగా అధికారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించాం.
వసతులు కల్పించాం
ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాం. లేనిచోట ర్యాంప్‌లు నిర్మించాం. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యం బారినపడిన వాళ్ల కోసం దాదాపు 200 వీల్‌చైర్లు అందుబాటులో ఉంచాం. టెంట్‌లు, కుర్చీలు, లైటింగ్ ఏర్పాటు చేశాం. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందించేందుకు ఏఎన్‌ఎం బృందం ఉంటుంది.
16న మేయర్ ఎన్నిక
ఎన్నికల సంఘం షెడ్యూల్ ఆధారంగా ఈ నెల 16వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పరోక్ష పద్ధతిన జరుగుతుంది. నగరపాలకసంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ఈ ఎన్నిక రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో చేపడతాం.
ఎస్‌ఆర్‌ఆర్‌లో లెక్కింపు
పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరుస్తాం. 13వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. 33 మంది ఆర్‌వోల ఆధ్వర్యంలో 66 టేబుళ్లు ఏర్పాటు చేశాం. డివిజన్లవారీగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తాం. అనంతరం సాధారణ ఓట్ల లెక్కింపు చేపడుతాం. వేయిఓట్లకు ఒక రౌండ్ ఉంటుంది. 25 బ్యాలెట్ పేపర్లకు ఒక బండెల్ తయారు చేసి, ఆ తరువాత వేయి ఓట్లు తీసుకొని అభ్యర్థుల వారీగా లెక్కిస్తాం. అనంతరం ఫలితాలు ప్రకటిస్తాం.
నగరపాలకసంస్థ ఎన్నికల ప్రక్రియకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఈ నెల 11వ తేదీన జరిగే పోలింగ్, 13వ తేదీన చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలోని 66 డివిజన్లలో పోలింగ్ కేంద్రాలు, ఏర్పాట్లు, సిబ్బంది, ఓట్ల లెక్కింపు తదితర అంశాలను గురించి శనివారం నగరపాలకసంస్థ
కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ‘సాక్షి’తో మాట్లాడారు.
డబుల్ ఓట్లు.. డెత్ ఓట్లు.. ఆబ్సెంట్‌తో గుర్తింపు
పోలింగ్‌లో కీలక సమస్య అయినా డెత్‌ఓట్లు, డబుల్ ఓట్లు, షిఫ్టెడ్ ఓట్లను పోల్ చిట్టీల పంపిణీ ద్వారా గుర్తిస్తున్నాం. ఇప్పటికే నగరంలోని అన్ని డివిజన్‌లలో ఇంటింటికి ఓటర్ల వారీగా పోల్ చిట్టీలను పంచుతున్నాం. పోల్ చిట్టీలు పంచేటప్పుడు, డెత్ ఓట్లు, షిఫ్టెడ్ ఓట్లు, ఒకటికి మించి ఉన్న ఓట్లు ఉన్న వాళ్లు చిట్టీలు తీసుకొనే పరిస్థితి లేదు. దీంతో ఆ జాబితాను గుర్తించి, సంబంధిత ప్రిసైడింగ్ అధికారికి అప్పగిస్తున్నాం. ఆ జాబితా ఆధారంగా అలాంటి ఓట్లపై పీవోలకు ముందుగానే అవగాహన ఉంటుంది.
116 ప్రాంతాలు.. 477 కేంద్రాలు


