సేవలు మెరుగుపరచాలి
కరీంనగర్: ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజారోగ్య సేవలు మెరుగుపర్చాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, సామాజిక ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమకూర్చిన అధునాతన పరికరాలను ఉపయోగిస్తూ రోగులకు విస్త్తృతసేవలు అందించాలన్నారు. ఆస్పత్రుల్లో ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత మందుల వివరాల బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గైనకాలజీ, పిల్లల వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు సమన్వయంతో గర్భిణులు, శిశువులకు సేవలు అందించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని తెలిపారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టీబీ పరీక్షల సంఖ్య పెంచి జబ్బు ఉన్న వారిని గుర్తించి, మందులు అందజేయాలన్నారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, ప్రోగ్రాం అధికారి సనా, జీజీహెచ్ ఆర్‌ఎంవో నవీన పాల్గొన్నారు.
మేడారం ప్రసాదం బుకింగ్‌లో మొదటిస్థానం
కరీంనగర్ టౌన్: మేడారం ప్రసాదం బుకింగ్‌లో కరీంనగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలి చిందని కార్గో మేనేజర్ వెంకటనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జాతరకు వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే బంగారాన్ని అందజేసే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. బుకింగ్స్ చేసుకున్న భక్తులకు బంగారం(బెల్లం), అమ్మవారి ఫొటో, పసుపుకుంకుమ అందించామని తెలిపారు. గతనెల 17 నుంచి ఈనెల 5వ తేదీ వరకు రీజియన్ పరిధిలో 211 బుకింగ్స్ నమోదు అయ్యాయని, రూ.63,089 ఆదాయం వచ్చిందన్నారు. జోన్ పరిధిలో కరీంనగర్ రీజియన్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం రాజు ఆర్టీసీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ చంద్రమౌళి, ఎన్.అన్వేశ్ తదితరులను అభినందించారు.
చట్టాలపై అవగాహన అవసరం
కొత్తపల్లి(కరీంనగర్): చట్టాలపై అవగాహన లేమితో చాలా మంది నేరాల బాట పడుతున్నారని, విద్యార్థి దశ నుంచే న్యాయ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటే సురక్షిత సమాజం ఏర్పడుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు తెలిపారు. కొత్తపల్లి మండలం ఎలగందుల తెలంగాణ మోడల్‌స్కూల్‌లో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పెరుక రంగయ్యపటేల్, చిట్టి చంద్రప్రకాశ్‌రెడ్డి, ఏ.కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రాథమిక హక్కులను కాపాడుకుంటూనే, పౌర బాధ్యతలు నెరవేర్చాలన్నారు. విద్యార్థినులు వ్యక్తిగత ఫొటోల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ వేధింపులకు గురైతే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. న్యాయవాదులు కీర్తి శ్రీధర్, బొజ్జ శ్రీలక్ష్మి, అశ్విని, ఎస్.ప్రవీణ్ కుమార్, ఏ.వెంకటేశ్, కే.ఆనంద్ భాస్కర్ పాల్గొన్నారు.
రెజ్లింగ్‌లో సత్తా చాటాలి
కరీంనగర్‌స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించాలని కరీంనగర్ జిల్లా క్రీడల యువజన అధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి అండర్–15 రెజ్లింగ్ జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. డీవైఎస్‌వో మాట్లాడుతూ.. రెజ్లింగ్‌లో జిల్లాకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలని సూచించారు. జిల్లా నుంచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు. రాణించినవారు ఈనెల 8న హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు నిర్వహణ కార్యదర్శి మాడగొని వంశీకృష్ణ తెలిపారు. పీడీలు పట్లావత్ శిరీష, సఫియా బేగం పాల్గొన్నారు.
సేవలు మెరుగుపరచాలి
సేవలు మెరుగుపరచాలి


