రేపు ప్రజావాణి రద్దు
కరీంనగర్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల క్రమంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని, కోడ్ ముగిసేంతవరకు కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. కోడ్ ముగిసిన తర్వాత ప్రజా వాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.
కేసీఆర్ విచారణ సరికాదు
మానకొండూర్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు విచారణ పేరిట పిలవడాన్ని వ్యతిరేకిస్తున్నామని, కేసీఆర్‌ను బద్నాం చేయడానికే కొత్త నాటకానికి తెరతీశారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. మానకొండూర్‌లో శనివారం మాట్లాడుతూ.. మార్పుకోసం ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. అందుకు మానకొండూర్ నియోజకవర్గమే సాక్ష్యమన్నారు. కేబుల్‌బ్రిడ్జి ఆధ్వానంగా మారిందని, దీనికి కారణం కాంగ్రెస్ అన్నారు. నేషనల్ హైవేను అప్పటి ఎంపీ, ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదిస్తే, తాను మంజూరు చేయించానని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ పేరిట పిలవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిపై ఆదివారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 2029 ఎన్నికల వరకు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, తాళ్లపల్లి శేఖర్‌గౌడ్, సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
కరీంనగర్‌టౌన్: చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతూ, బాల కార్మికులు లేని జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ ధనలక్ష్మి అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోలీసు, లేబర్, చైల్డ్ హెల్ఫ్‌లైన్ 1098, సమగ్ర బాలల పరిరక్షణ పథకం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ శనివారంతో ముగిసింది. నెలరోజుల పాటు విస్తృతంగా తనిఖీలను నిర్వహించడం జరిగిందని, జిల్లాలో మొత్తం 117 మంది పిల్లలను రెస్క్యూ చేసినట్లు తెలిపారు. 109 బాలురు, 8బాలికలు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కమిటీ సభ్యులు రేండ్ల కళింగ శేఖర్, విజయ్ కుమార్, రాధ ఉన్నారు.


