ఉరుకులు పరుగులు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 66 డివిజన్లకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం చివరిరోజు పలువురు అభ్యర్థులు ర్యాలీలు, ప్రదర్శనతో వచ్చి నామినేషన్లు వేశారు. కొంతమంది చివరినిమిషంలో వచ్చి సమయం ముగియడంతో వెనుదిరిగారు. చివరిరోజు పలువురు అభ్యర్థులు బలప్రదర్శన చేపట్టారు. ఆలయాల్లో పూజలు నిర్వహించి, ర్యాలీలు నిర్వహించారు. ఒగ్గుడోలు, కళాకారులు, నృత్యాలతో నగరం హోరెత్తింది. నామినేషన్‌ల సందర్భంగా అభ్యర్థులు, ప్రతిపాదకులు మినహా మిగతా వారిని పోలీసులు బయటే నిలిపివేయడంతో మార్కెట్, బస్‌స్టేషన్ వైపు రోడ్లు కిక్కిరిసిపోయాయి. మద్దతుదారులనూ లోనికి తీసుకుపోనీయాలంటూ పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పలువురు అభ్యర్థులు చివరి నిమిషంలో నామినేషన్లు వేసేందుకు హడావుడి పడ్డారు. సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాన్ని మూసివేసి, అప్పటివరకు లోపల ఉన్నవాళ్లకే నామినేషన్‌కు అవకాశం ఇచ్చారు. 41వ డివిజన్‌కు చెందిన ఓ మహిళా అభ్యర్థి హాల్ బయట ఉండి, 5 గంటలదాటిన తరువాత లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు అనుమతించలేదు. పలువురు అభ్యర్థులు టైం అయిపోతుండడంతో పరుగులు పెడుతూ వచ్చారు.
నామినేషన్ వేసిన ముగ్గురు మాజీ మేయర్లు
నగరపాలకసంస్థ నామినేషన్ల పర్వంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. నగర మేయర్లుగా పనిచేసిన ముగ్గురు నాయకులు ఆయా పార్టీల తరఫున కార్పొరేటర్ స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు. 42 డివిజన్ నుంచి యాదగిరి సునీల్‌రావు, 58వ డివిజన్ నుంచి సర్ధార్ రవీందర్ సింగ్, 10వ డివిజన్ నుంచి డి.శంకర్ నామినేషన్లు వేశారు. శనివారం నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. సాయంత్రం చెల్లిన నామినేషన్ల వివరాలు ప్రకటిస్తారు.
చివరినిమిషంలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు, కుటుంబసభ్యుల ఉరుకులు పరుగులు
ఉరుకులు పరుగులు
ఉరుకులు పరుగులు


