కళలలో మ్యాజిక్.. గొంతులో మాయ!
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సమ్మక్క–సారలమ్మ జాతరలో ‘జర భద్రం.. పిల్లలు పట్ల అప్రమతంగా ఉండండి.. అత్యవసరమైతే 100 నంబర్‌కు ఫోన్ చేయండి.. పోలీసుల సాయం తీసుకోండి...’ అంటూ మైక్‌లో వినిపించే ఆ గొంతు ప్రభుత్వ రిటైర్డ్ హెడ్‌మాస్టర్ మేజిక్ రాజాది. కళ అంటే ఓ వేదిక.. స్వరం అంటే ఓ శక్తి.. ఈ రెండింటినీ తనలో కలిపి ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్న వ్యక్తి మ్యాజిక్ రాజా. గత మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా 100 ప్రకటనలకు స్వరం ఇచ్చిన ఆయన, ఇప్పటివరకు వెయ్యికి పైగా ఆడియో, వీడియో వాయిస్ ఓవర్లు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గోదావరి ఒడ్డున నిర్వహిస్తున్న సమ్మక్క జాతర సమయంలో భక్తులకు జాగ్రత్తలు సూచించే ఆడియోను పోలీసుల కోరిక మేరకు పూర్తిగా స్వచ్ఛందంగా, నయా పైసా తీసుకోకుండా అందించారు.


