ఏడేళ్లలో బండి సంజయ్ ఏడు కొత్తలు తెచ్చాడా?
రెండేళ్ల రేవంత్ పాలనలో రెండు రూపాయలు తేలేదు
బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి
మాజీ ఎంపీ, జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి వినోద్‌కుమార్
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఏడేండ్లలో ఏడు కొత్తలు తేలేదని, రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండు రూపాయల అభివృద్ధి చేసింది లేదని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ 8వ డివిజన్ అభ్యర్థి కాలువ మల్లేశంకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన ర్యాలీ, నామినేషన్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. అలుగునూరును హైదరాబాద్ స్థాయికి అభివృద్ధి చేశామన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే అల్గునూరులో ఇంటింటికీ తిరిగి రోడ్ల విస్తరణకు ప్రజలను ఒప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్‌ను స్పార్ట్ సిటీగా మార్చింది తామేనన్నారు. మానేరువాగుపై కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తే, కాంగ్రెస్ పాలనలో ఆ బ్రిడ్జిపై రాత్రి లైట్లు కూడా వెలగడం లేదని ఎద్దేవా చేశారు. 420 హామీల్లో ఉచిత బస్సులు తప్ప ఏవి అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్‌గా కాల్వ మల్లేశంను గెలిపిస్తే అల్గునూరు నుంచి మానకొండూరు వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


