షార్జా పోలీసుల అదుపులో కల్లెడ యువకుడు
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ యువకుడు రెండేళ్లు ఉండి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా షార్జా ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన సోమవారం జరిగింది. వివరాలు.. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన గాలిపల్లి మధు జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. స్వగ్రామం వస్తున్నానని ఇటీవల కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సోమవారం ఉదయం 6.30 గంటల సమయంలో మధు షార్జా ఎయిర్‌పోర్టుకు చేరుకుని బోర్డింగ్ చేస్తున్న సమయంలో ఎయిర్‌పోర్టు పోలీసులు అతడి నుంచి పాస్‌పోర్టు, సెల్‌ఫోన్ తీసుకుని అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులకు వాట్సప్‌లో వాయిస్‌రికార్డు పంపించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది అక్కడున్న వారికి సమాచారం అందించారు. కాగా గతంలో మధు పేరిట ఉన్న ఐడీ కార్డుతో గుర్తుతెలియని వ్యక్తులు రుణం తీసుకోగా, రుణం ఎగవేసి వెళ్లకుండా బ్యాంక్ అధికారులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవచూపి మధును స్వదేశానికి తీసుకువచ్చేలా కృషి చేయాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
వాయిస్ రికార్డుతో కుటుంబ సభ్యులకు సమాచారం


