‘ఇందిరమ్మ’ పేరిట మట్టిదందా
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం జూబ్లీనగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల పేరిట ట్రాక్టర్ యజమానులు అక్రమ మట్టి దందాను జోరుగా సాగిస్తున్నారు. సమీపంలోని గుట్ట నుంచి మట్టిని ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు న్నాయి. ఇటీవల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్న లబ్ధిదారులకు మాత్రమే గుట్ట నుంచి మట్టిని ట్రాక్టర్ యజమానులు రవాణా చేయాలని నిర్ణయించారు. అయితే కొందరు ట్రాక్టర్ యజమానులు ఇందిరమ్మ ఇండ్ల ముసుగులో ఇతర అవసరాలకు సైతం మట్టిని రవాణా చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో అధికారులు ఉండటంతో ఇదే అదునుగా మట్టి దందాను జోరుగా సాగిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి గ్రామంలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన నిర్మాణానికి అవసరమైన మట్టిని ట్రాక్టర్ యజమానులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే గ్రామస్తుల సమాచారంతో సోమవారం రెవెన్యూ అధికారులు గుట్ట వద్దకు వెళ్లడంతో ట్రాక్టర్ యజమానులు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి గుట్టనుంచి అక్రమ మట్టి రవాణాను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు.
అధికారుల రాకతో ట్రాక్టర్ డ్రైవర్ల పరార్


