వర్సిటీలో ఘనంగా ఎథ్నిక్ డే
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీలోని కామర్స్ కళాశాలలో బుధవారం ఘనంగా ఎథ్నిక్ డే నిర్వహించారు. ఈ వేడుకలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేశ్‌కుమార్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉట్టి కొట్టి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. అధ్యాపకులు, విద్యార్థులు సంప్రదాయాలను మరవొద్దని, జాతి గౌరవాన్ని పెంపొందించే ఆచారాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఆచారాలకు సంబంధించిన పండుగలను జరుపుకొని జాతి ఐక్యతకు, భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు కట్టుబడి ఉండి దేశ సంస్కృతిని గౌరవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, ఓఎస్డీ హరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి డి.సురేశ్‌కుమార్, ప్రిన్సిపాళ్లు రమాకాంత్, సుజాత, అధ్యాపకులు నజిముద్దీన్ మున్వర్, పద్మావతి, శ్రీవాణి, కృష్ణకుమార్, తిరుపతి, మనోజ్‌కుమార్, నరేశ్, పరశురాం, సావిత్రి, విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయ వీసీ, ఇతర అధికారులు, విద్యార్థినులు ఉత్సాహంగా పట్టు చీరలు, ధోవతులు, కుర్తాలు, పైజామాలు వంటి సంప్రదాయ వస్త్రధారణలో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


