ఏకగ్రీవ యత్నం.. ఎన్నిక అనివార్యం
రూ.25 లక్షలకు వేలం పాడిన కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి
ఆ మొత్తం దేవాలయం ఖాతాలో డిపాజిట్
ఏకగ్రీవమైనట్లు గ్రామస్తుల తీర్మానం
ఎంట్రీ ఇచ్చిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
అంతే మొత్తానికి చెక్కు ఇచ్చిన బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి
ఏకగ్రీవ యత్నానికి రాజకీయ బ్రేక్
హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ మండలం వెంకట్రావుపల్లి పంచాయతీ (జనరల్ స్థానం) ఎన్నికల్లో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రధాన పార్టీల నాయకుల జోక్యంతో గ్రామంలోని దేవాలయం నిధికి విరాళాలు భారీగా వచ్చి చేరాయి. మూడోవిడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వెంకట్రావుపల్లి వివిధ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఉపసంహరణకు గడువు లోపు అభ్యర్థులెవరూ ఉపసంహరించుకోలేదు.
రూ.25.25లక్షలకు వేలం
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామస్తులు ఏకగ్రీవం కోసం బహిరంగ వేలం వేశారు. వేలంలో ముగ్గురు అభ్యర్థులు పాల్గొనగా.. తలా రూ.2లక్షల చొప్పున డిపాజిట్ చేశారు. ఉత్కంఠభరితంగా సాగిన వేలంలో చివరకు కాంగ్రెస్ నాయకుడు పత్తి కృష్ణారెడ్డి తన భార్య అనిత తరఫున రూ.25.25లక్షలు చెల్లించేందుకు అంగీకరించాడు. వేలం పూర్తయ్యాక.. ఓడిన అభ్యర్థుల డిపాజిట్‌ను వారికి తిరిగి ఇచ్చి కృష్ణారెడ్డి భార్యకు పోటీగా ఎవరూ ఉండరాదని గ్రామస్తులంతా బాండ్ పేపర్‌పై సంతకాలు చేసి ఏకగ్రీవం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ మొత్తాన్ని తొలి విడతగా గ్రామ శివాలయం అకౌంట్‌లో జమ చేశారు.
సీన్‌లోకి బీఆర్‌ఎస్ అభ్యర్థి..
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రంగంలోకి దిగారు. బీఆర్‌ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయించి.. కృష్ణారెడ్డి చెల్లించిన మొత్తానికి సమానంగా రూ.25.25లక్షల చెక్కును పార్టీ తరఫున అందించారు. దీంతో బీఆర్‌ఎస్ తరఫున కన్నెబోయిన విజేందర్ బరిలో నిలిచినట్లయ్యింది. మరోవైపు కృష్ణారెడ్డి చెల్లించిన రూ.25.25లక్షలు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన రూ.25.25 లక్షలు శివాలయం అకౌంట్‌లోకి వచ్చి చేరాయి. అదే సమయంలో తన భార్య ఏకగ్రీవమైందన సంతోషం కృష్ణారెడ్డికి లేకుండాపోయింది. ప్రస్తుతం అనిత, విజేందర్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థిగా ముద్ధమల్ల లక్ష్మి బరిలో నిలిచారు.


