ఓటేసే ముందు ఆలోచించండి..
కరీంనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పల్లె ప్రగతికి పాటుపడుతోంది.. పైసలిస్తోంది మోదీ ప్రభుత్వమేనని, ఇప్పటివరకు గ్రామాల్లో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో చేపట్టినవేనని స్పష్టం చేశారు. రైతు వేదిక నుంచి శ్మశాన వాటిక దాకా.. రోడ్ల నిర్మాణం మొదలు వీధిదీపాల దాకా.. ఆఖరికి గ్రామాల్లో జరిగే పారిశుధ్య పనులకు సైతం కేంద్ర నిధులే వెచ్చిస్తున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని విమర్శించారు. పచ్చని పల్లెలకు పైసా ఇయ్యకుండా, చేసిన పనులకు బిల్లులియ్యకుండా సర్పంచులు ఆత్మహత్య చేసుకునే దుస్థితికి తెచ్చింది బీఆర్‌ఎస్సేనని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి పైసలిస్తున్న బీజేపీ బలపర్చిన అభ్యర్థులకే ఓటేసి గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకొని ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పచ్చని పల్లెలకు పైసా ఇయ్యకుండా చిచ్చుపెడుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలంటే.. ఆ పార్టీలు బలపర్చిన అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు నయా పైసాఇయ్యలేదు.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసల్లేవు.. నన్ను కోసినా నయా పైసా రాదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే చెబుతున్నడు.. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలోనూ పంచాయతీల అభివృద్ధికి పైసా ఇయ్యలేదు.. పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ, కేంద్ర మంత్రిగా ఎంపీ లాడ్స్ నిధులున్నాయి.. సీఎస్సార్, ఎంపీ లాడ్స్ సహా అనేక రూపాల్లో పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న.. భవిష్యత్తులోనూ కేంద్రాన్ని ఒప్పించి అధిక నిధులు తెస్తానని తెలిపారు.


