గెలిచినోడే మనోడు!
హుజూరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు.. ముగ్గురు పోటీ పడుతున్నారు. వారి కి ఆ పార్టీ నేతలు సర్ది చెప్పలేక గెలిచినోడే మనోడు అనే పరిస్థితికి వచ్చేశారు. ప్రధానంగా అధికార పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. సర్ది చెప్పినా వినకపోవడంతో పోటీ అనివార్యమైంది. గెలిచి రండంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రధానంగా అధికార పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులకు, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసొచ్చి ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులకు మధ్య లోకల్ వార్ నడుస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రచారం ఊపందుకుంది.
లోకల్ వార్..
జిల్లాలో మొదటి, రెండో, మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తే.. ఓటర్లు ఎవరికి మద్దతిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మెజార్టీ గ్రామాల్లో కాంగ్రెస్ రెండు వర్గాలు పోటీ చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం దీటుగానే తలపడుతున్నారు. ఇరువర్గాలు బలంగా ఉన్న గ్రామాల వైపు పార్టీ కీలక నేతలు చూసీచూడనట్టుగానే వదిలేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక చూద్దాంలే అన్నట్టుగా డబుల్ గేమ్ ఆడుతున్నారని తెలుస్తోంది. అయితే పలువురు అభ్యర్థులు పార్టీ మద్దతు మాకంటే మాకే ఉందని ప్రచారం చేయడమే గాక.. ప్రచారం వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
పార్టీ జెండాలతోనే ప్రచారం
పార్టీల రహితంగా జరిగే ఎన్నికలే అయినా.. అభ్యర్థులు మాత్రం పార్టీల జెండాలతోనే వాడవాడలా ప్రచారం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ స్థానికంగా అవగాహనతోనే పోటీ చేస్తున్నాయి.
మద్యం, డబ్బు పంపిణీ
ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా మద్యం, డబ్బు ఏరులై పారుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే మద్యం పంపిణీ జోరుగా సాగుతుండగా.. ఓటర్లకు పెద్ద గ్రామ పంచాయతీల్లో రూ.వెయ్యి నుంచి రూ.2వేలతోపాటు క్వార్టర్, ఓ మోస్తరు పంచాయతీల్లో మందుతోపాటు రూ.500, చిన్న గ్రామాల్లో మందు మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.


