అందుబాటులోకి ‘మ్యాంగోమాస్టర్’
జగిత్యాలఅగ్రికల్చర్: తెగుళ్ల బారి నుంచి మామిడి తోటలను కాపాడుకునేందుకు రైతులు నాలుగైదుసార్లు రసాయన మందులు పిచికారీ చేస్తుంటారు. చెట్లు ఎత్తుగా ఉంటే పిచికారీ చేయడం చాలా ఇబ్బంది. ఈ క్రమంలో రైతుల ఇబ్బందులు తప్పించేందుకు మ్యాంగో మాస్టర్ యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రం 42 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్‌కు బిగించుకోవచ్చు. యంత్రం ద్వారా పొగమంచులాగా నీటి బిందువులు మామిడి ఆకులపై పడతాయి. చెట్టు ఎంత ఎత్తు ఉన్నా మందును సమంగా పిచికారీ చేస్తుంది. 25 మీటర్ల ఎత్తు, 20 మీటర్ల అడ్డంతో మందును సమర్థవంతంగా పిచికారీ చేస్తుంది. యంత్రం బరువు 220 కిలోలు. గంటకు 3 వేల లీటర్ల మందును చెట్లపై పిచికారీ చేస్తుంది. యంత్రానికి కంప్యూటరైజ్డ్ బ్యాలెన్స్‌డ్ ఫ్యాన్ సిస్టం రివర్స్‌గా ఉంటుంది. తద్వారా యంత్రం నడిచేటప్పుడు చెట్ల ఆకులు, భూమి మీది గడ్డిని ఫ్యాన్లలోకి లాక్కోకుండా ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ వద్ద కంప్యూటరైజ్డ్ ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది. కూలీల అవసరం లేకుండానే మందు పిచికారీ చేసుకోవచ్చు. దీని ధర రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు ఉంటుంది.
మామిడి తోటల్లో పిచికారీ యంత్రం
కూలీల సమస్యకు చెక్


